Nizamabad

News February 17, 2025

NZB: ఏసీ బస్సుల్లో 10% తగ్గింపు: ఆర్టీసీ RM

image

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బెంగళూరు ఏసీ బస్సుల టికెట్ ఛార్జీలపై 10% రాయితీ కల్పించినట్లు NZB ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జ్యోత్స్న తెలిపారు. ఈ రాయితీ ఏసీ స్లీపర్, ఏసీ సీటర్, రాజధాని బస్సులకు వర్తిస్తుందని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. https://www.tgsrtcbus.in వెబ్సైట్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు.

News February 16, 2025

NZB: ప్రయోగ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డీఐఈఓ

image

నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్ష కేంద్రాలను జిల్లా ఇంటర్ విద్యశాఖ అధికారి రవికుమార్ తనిఖీ చేశారు. అదేవిధంగా జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజియుద్దీన్, కనకమహాలక్ష్మి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలో మరో 12 కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కెమెరాలు పనిచేస్తున్న విషయాన్ని స్వయంగా డీఐఈఓ పరిశీలించారు.

News February 16, 2025

NZB: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

image

NZB, ADB, KNR, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా భావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

News February 16, 2025

KMR: అప్పుల బాధ..ఒకే రోజు ఇద్దరి సూసైడ్..!

image

గాల్లో దీపాల్లా..వ్యక్తుల జీవితాలు మారిపోయాయి. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ..ఆ కుటుంబాల్లో పుట్టెడు దుఃఖాన్ని మిగుల్చుతున్నారు. కామారెడ్డి జిల్లాలో శనివారం ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. ఇల్లు నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేక.. రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లిలో నర్సింలు సూసైడ్ చేసుకోగా..కుమార్తె పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చలేక బుడ్మి వాసి జీవన్ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

News February 16, 2025

బాల్కొండ: చేపల వేటకు వెళ్లి జాలరి మృతి

image

బాల్కొండకు చెందిన జాలరి బట్టు నారాయణ(55) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నారాయణ రోజూలాగే ఉదయం 4 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వద్ద చేపల వేటకు నీటిలో దిగాడు. చేపల కోసం పెట్టిన కండ్రిగలో వలలో చిక్కుకుని నీట మునిగి చనిపోయాడు. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని బయటికి తీసి పోలీసులు పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆర్మూర్‌కు తరలించారు.

News February 16, 2025

NZB: నిబంధనలు తప్పకుండా పాటించాలి: ఇన్‌ఛార్జ్ సీపీ

image

ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించకూడదని నిజామాబాద్ ఇన్‌ఛార్జి CP సింధుశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అనుమతులు తప్పనిసరిగా పొందాలన్నారు. మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజలు పోలీస్ అధికారులకు సహకరించాలన్నారు.

News February 15, 2025

నిజాంసాగర్: అప్పుల బాధతో ఉరేసుకొని వ్యక్తి మృతి

image

అప్పుల బాధతో ఓ వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన ఘటన శనివారం నిజాంసాగర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. లక్ష్మీ, జీవన్‌లకు 27 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు పెళ్లి చేయగా అప్పులు అయ్యాయి. దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. శనివారం జీవన్ మనస్తాపానికి గురై ఉరేసుకొని మృతి చెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 15, 2025

నిజామాబాద్: 18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్

image

నిజామాబాద్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్‌తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.

News February 15, 2025

NZB: ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు

image

గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఉత్సవాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. వినాయకనగర్‌లోని సేవాలాల్ మహరాజ్ విగ్రహానికి కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల బాధ్యులు, జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

News February 15, 2025

NZB: రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది ఇతడే

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ జాతీయ రహదారి కారు అదుపుతప్పిన ఘటనలో గంగాధర్ (46) అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అతని కూతురు లహరి(20)కి తీవ్రగాయాలయ్యాయి. వీరి స్వగ్రామం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుక్కునూర్ గ్రామంగా గుర్తించారు. గంగాధర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.