News May 30, 2024

‘పోస్టల్ బ్యాలెట్’ రూల్స్‌పై హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్

image

AP: పోస్టల్ బ్యాలెట్‌పై RO సీల్ లేకున్నా ఓటును తిరస్కరించవద్దంటూ సీఈవో ఎంకే మీనా ఇచ్చిన మెమోపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చారని పేర్కొంది. దీనివల్ల కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను ఇవాళే అత్యవసరంగా విచారించేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది.

News May 30, 2024

మోదీపై అనర్హత వేటు వేయాలని పిటిషన్‌.. కొట్టేసిన హైకోర్టు

image

ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేయకుండా వేటు వేయాలని దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. మోదీ రిటర్నింగ్ అధికారి ఎదుట తప్పుడు వాగ్దానం చేశారని ఆరోపిస్తూ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని పిటిషనర్ విజయ్ కుమార్ న్యాయస్థానాన్ని కోరారు. తనను చంపేందుకు మోదీ ప్రయత్నించారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌ దుర్మార్గపు ఉద్దేశంతో ఉందని పేర్కొంటూ కొట్టివేసింది.

News May 30, 2024

ప్రాజెక్టుల ఆలస్యంతో మొండి బకాయిలు అధికం!

image

దేశంలో ₹26.9 ట్రిలియన్ల ఖర్చుతో 1,873 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు జరుగుతుండగా, వాటిలో 779 ప్రాజెక్టులు(40%) ఆలస్యం అవుతున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. దీనివల్ల ₹5 ట్రిలియన్ల ఖర్చు పెరుగుతుందని, ఇది లోన్లు ఇచ్చిన బ్యాంకులు, NBFCలను ప్రభావితం చేస్తుందని గణాంకాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రాజెక్టులు పూర్తయితేనే నగదు ప్రవాహం బాగుంటుందని, లేదంటే మొండి బకాయిలు అధికమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

News May 30, 2024

భారత క్రికెటర్ సంచలన పోస్ట్

image

బాలీవుడ్ సెలబ్రిటీల్లో కొందరు పాలస్తీనాకు మద్దతుగా పోస్టులు చేస్తున్న వేళ భారత క్రికెటర్ రాహుల్ తెవాటియా సంచలన పోస్ట్ చేశారు. ఆయన పాకిస్థాన్‌లోని హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాల అంశాన్ని లేవనెత్తారు. ‘అందరి దృష్టి పాకిస్థాన్‌లోని హిందువులపై ఉంది’ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. కాగా, గాజాలోని రఫా ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడులపై పలువురు సెలబ్రిటీలు ALL EYES ON RAFAH అని పోస్టులు చేస్తున్నారు.

News May 30, 2024

బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలపై కొత్త ప్రభుత్వం ఫోకస్?

image

కొత్త ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో కీలక సంస్కరణలను తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతకొంతకాలంగా సాగుతున్న IDBI బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పూర్తిచేసే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. మరోవైపు బ్యాంకింగ్‌కు సంబంధించి 2016లో తీసుకొచ్చిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌ట్రప్సీ కోడ్ (IBC)లో కూడా కేంద్రం మార్పులు తెచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి.

News May 30, 2024

మూడేళ్లలో లక్షన్నర మొబైల్స్ కొట్టేశారు..!

image

TG: మొబైల్ ఫోన్ల చోరీకి హైదరాబాద్‌ అడ్డాగా మారింది. పోలీసు రికార్డుల ప్రకారం.. నగరంలో గడచిన మూడేళ్లలో లక్షన్నరకు పైగా మొబైల్ ఫోన్లు చోరీ అయ్యాయి. రోజుకు సగటున 100 ఫోన్లను దొంగలు కొట్టేస్తున్నారు. ఈ ఫోన్లన్నీ ఆఫ్రికాలోని సూడాన్‌కు వెళ్తున్నట్లు సమాచారం. ఆఫ్రికా దేశాల నుంచి చదువు, వైద్యం పేరిట భారత్ వస్తున్న అక్కడి పౌరులు ఈ తరలింపులో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

News May 30, 2024

MODI: 75 రోజుల్లో 180 ర్యాలీలు!

image

లోక్‌సభ ఎన్నికల్లో 75 రోజుల సుడిగాలి పర్యటనలో ప్రధాని మోదీ దాదాపు 180 ర్యాలీల్లో పాల్గొన్నారు. వీటిలో సగం యూపీ, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, దక్షిణ భారత్‌లోని ఐదు రాష్ట్రాల్లో 35 ర్యాలీలు నిర్వహించారు. ఈ ఒక్క నెలలోనే PM 96 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం. కాగా ఇవాళ సాయంత్రం ఎన్నికల ప్రచార పర్వం ముగియనుండగా పంజాబ్‌లో ర్యాలీతో ఆయన ప్రచారానికి తెరపడనుంది.

News May 30, 2024

T20WC హిస్టరీలో రోహిత్, షకీబ్ వెరీ స్పెషల్

image

2007లో ప్రారంభమైన T20 వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు అన్ని ఎడిషన్లలో పాల్గొన్న క్రికెటర్లుగా రోహిత్ శర్మ, షకీబ్ అల్ హసన్ రికార్డు సృష్టించారు. వీరి ప్రస్థానం 17ఏళ్లుగా కొనసాగుతోంది. 2007, 09, 10, 12, 14, 16, 21, 22 WCలలో రోహిత్ 39 మ్యాచ్‌లు ఆడి 34.39 యావరేజ్, 127.88SRతో 963 రన్స్ చేశారు. షకీబ్ 36 మ్యాచ్‌లలో 742 రన్స్, 47 వికెట్లతో సత్తా చాటారు. ప్రస్తుత T20WC వారికి తొమ్మిదో ఎడిషన్ కావడం విశేషం.

News May 30, 2024

క్రెడిట్ కార్డులపై LRS.. కేంద్రాన్ని నెల గడువు కోరిన బ్యాంకులు

image

ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డుల చెల్లింపులకు లిబెరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) అమలు చేసేందుకు బ్యాంకులు కేంద్రాన్ని గడువు కోరాయి. LRS నిర్వహణకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు జూన్ 30 వరకు టైమ్ కావాలని తెలిపాయి. తుది మార్గదర్శకాలు వచ్చాక LRS అమలు చేయాలని పలు బ్యాంకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ స్కీమ్‌తో భారతీయులు విదేశాల్లో ఓ ఆర్థిక సం.లో $2,50,000 (రూ.2.08కోట్లు) వరకు ఖర్చు చేయొచ్చు.

News May 30, 2024

గెలిచిన 48 గంటల్లో పీఎంను డిసైడ్ చేస్తాం: జైరామ్ రమేశ్

image

ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి 272 సీట్లకుపైగా గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. అత్యధిక సీట్లు సాధించిన పార్టీనే కూటమికి అధ్యక్షత వహిస్తుందన్నారు. గెలుపొందిన 48 గంటల్లోనే ప్రధాని ఎవరనేది ఖరారు చేస్తామని తెలిపారు. ఇండియా కూటమి గెలుపొందాక NDA కూటమిలోని పలు పార్టీలు కూడా తమతో చేతులు కలిపే అవకాశం ఉందన్నారు.