News November 7, 2024

ఈనెల 18-26 మధ్య జిల్లాల్లో BC కమిషన్ పర్యటన

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన BC కమిషన్ జిల్లాల్లో పర్యటించనుంది. ఈ నెల 18 నుంచి 26 వరకు ఈ పర్యటన ఉంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో పర్యటించనుంది. ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పర్యటించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ప్రత్యేక కమిషన్‌తో సమాచారం పంచుకోనుంది.

News November 7, 2024

మోదీని ప్రపంచమంతా ప్రేమిస్తోంది: ట్రంప్

image

అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. మరోసారి ఇద్దరం కలిసి పనిచేద్దామని, ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునే దిశగా చర్యలు తీసుకుందామని పిలుపునిచ్చారు. ప్రపంచశాంతికి కృషి చేద్దామన్నారు. ప్రపంచం మొత్తం మోదీని ప్రేమిస్తోందని.. భారత్ అద్భుత దేశమని ట్రంప్ కొనియాడారు. భారత్, మోదీని నిజమైన స్నేహితులుగా భావిస్తానని ఆయన తెలిపారు.

News November 7, 2024

ట్రంప్‌నకు అభినందనలు.. హసీనాను పీఎంగా పేర్కొన్న అవామీ లీగ్

image

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌నకు అభినందనలు తెలుపుతూ షేక్ హసీనా పేరుతో అవామీ లీగ్ రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇందులో హసీనాను బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రస్తావించడమే దీనికి కారణం. రిజర్వేషన్లపై నిరసనలతో హసీనా బంగ్లాదేశ్ విడిచి భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడగా మహమ్మద్ యూనస్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

News November 7, 2024

IPLలో రూ.13 కోట్లు.. ఆ డబ్బుతో రింకూసింగ్ ఏం చేశారంటే?

image

టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ రూ.3.5 కోట్లతో ఇల్లు కొనుగోలు చేశారు. IPLలో KKR అతడిని రూ.13 కోట్లకు రిటైన్ చేసుకున్న కొద్ది రోజులకే యూపీ అలీగఢ్‌లోని ఓజోన్ సిటీలో ఖరీదైన 500 చదరపు గజాల బంగ్లాను కొన్నారు. కొద్ది రోజుల క్రితం కుటుంబసభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. కాగా, రింకూ సింగ్ తండ్రి ఇదే ఓజోన్ సిటీలో గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసేవారు. సక్సెస్ అంటే ఇదే కదా మరి!

News November 7, 2024

ఛార్జింగ్‌లో పేలిన ఐఫోన్.. చైనా యువతి ఆరోపణ

image

తన ఐఫోన్-14 ప్రో మ్యాక్స్ ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగా పేలిపోయిందని చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన యువతి ఆరోపించారు. ఆ సమయంలో తాను నిద్రపోతున్నానని, పేలుడు కారణంగా చేతికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. గది అంతటా మంటలు వ్యాపించి తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయారు. ఆమె ఆరోపణలపై యాపిల్ స్పందించింది. ఈ సమస్యను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, దర్యాప్తు చేస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది.

News November 7, 2024

తిరుగులేని మొండితనం అంటే ట్రంప్: అదానీ

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపుపై గౌతమ్ అదానీ హర్షం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘మొండితనానికి, సంకల్పబలానికి, మొక్కవోని దీక్షకు, తెగువకు ప్రతిరూపం ఎవరైనా ఉన్నారంటే అది డొనాల్డ్ ట్రంపే. అమెరికా వ్యవస్థాపక విలువల్ని రక్షిస్తూ ఆ దేశ ప్రజలకు ప్రజాస్వామ్యం ఇచ్చిన శక్తి ఓ అద్భుతం. అమెరికా 47వ అధ్యక్షుడికి కంగ్రాట్యులేషన్స్’ అని పేర్కొన్నారు.

News November 7, 2024

తలైవాస్‌కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన తెలుగు టైటాన్స్

image

ప్రోకబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ అదరగొట్టింది. తొలి మ్యాచ్‌లో తమను ఓడించిన తమిళ్ తలైవాస్‌పై గెలిచి బదులు తీర్చుకుంది. ఈరోజు గచ్చిబౌలి వేదికగా జరిగిన మ్యాచ్‌లో 34-35 తేడాతో టైటాన్స్ గెలుపొందింది. కాగా ఇప్పటి వరకు 7 మ్యాచులు ఆడిన టైటాన్స్ 4 గెలిచి 4వ స్థానంలో ఉంది. తొలి స్థానంలో పుణేరి పల్టాన్స్(7లో 5 గెలుపు) ఉండగా చివరి స్థానంలో గుజరాత్ జెయింట్స్(5లో ఒక గెలుపు) ఉన్నాయి.

News November 6, 2024

అకౌంట్లలోకి డబ్బులు.. కీలక ప్రకటన

image

AP: ఈ విద్యాసంవత్సరం(2024-25) నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు నేరుగా కాలేజీల ఖాతాల్లో జమచేసేలా పాత పద్ధతిని అవలంబిస్తామని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. బకాయిలు రూ.3,500 కోట్లు విడతల వారీగా చెల్లిస్తామని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కాలేజీలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. కాగా, గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు తల్లుల ఖాతాల్లో డిపాజిట్ అయ్యేవి.

News November 6, 2024

మళ్లీ కెప్టెన్ అయిన డేవిడ్ వార్నర్

image

ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ మళ్లీ కెప్టెన్సీని చేపట్టారు. బాల్ టాంపరింగ్ కారణంగా ఆయన కెప్టెన్సీ చేయకుండా క్రికెట్ ఆస్ట్రేలియా ఆరేళ్ల క్రితం నిషేధం విధించింది. తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేయడంతో బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ ఆయన్ను తమ కెప్టెన్‌గా నియమించింది. అదే జట్టుకు 2011లో వార్నర్ కెప్టెన్‌గా ఉన్నారు. IPLలోనూ SRHకి కెప్టెన్‌గా కప్ అందించారు.

News November 6, 2024

నాకు కాదు DCMకు చెప్పు: అంబటి

image

AP: హోం మంత్రి అనిత ఎవరో చెప్పాల్సింది తనకు కాదని, DCMకు చెప్పాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అనిత ఇచ్చుకున్న సెల్ఫ్ సర్టిఫికెట్‌కు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, చాలా సంతోషంగా ఉందని ఎద్దేవా చేశారు. ‘H.Mగా బాధ్యత వహించండి. నేను బాధ్యత తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి’ అన్న వ్యక్తికి <<14546885>>ఈ విషయాన్ని<<>> చెప్పాలని సూచించారు.