News March 28, 2024

ప్రధాని మోదీ కార్లకు అనుమతి నిరాకరించిన NGT

image

ప్రధాని మోదీ కాన్వాయ్‌కు చెందిన మూడు కార్లకు రిజిస్ట్రేషన్ పొడిగించాలన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) విజ్ఞప్తిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తిరస్కరించింది. పదేళ్లకు మించిన డీజిల్ కార్లను 2018లో సుప్రీంకోర్టు నిషేధించడమే ఇందుకు కారణంగా పేర్కొంది. రెనాల్ట్ ఎండీ-5 మోడల్‌కు చెందిన ఈ కార్లకు 2014లో రిజిస్ట్రేషన్ అయింది. తక్కువ కిలోమీటర్లే తిరగడంతో వీటి రిజిస్ట్రేషన్ పొడిగించమని SPG కోరింది.

News March 28, 2024

అగ్నివీర్ స్కీమ్‌లో అవసరమైతే మార్పులు చేస్తాం: రాజ్‌నాథ్

image

భారత సైన్యంలోకి యువతను చేర్చుకునే అగ్నివీర్ పథకంలో అవసరమైతే మార్పులు తీసుకొస్తామని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. వాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అగ్నివీర్‌ల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే చెప్పారు. అగ్నివీర్‌ల సర్వీస్ కాలం నాలుగేళ్లు కాగా మెరిట్ ఆధారంగా ప్రతి బ్యాచ్‌లో 25% మందిని 15 ఏళ్లు పొడిగిస్తారు.

News March 28, 2024

సీఎం జగన్‌కు చంద్రబాబు ఏడు ప్రశ్నలు

image

AP: 90 శాతం హామీలు నెరవేర్చామని చెప్పుకునే సీఎం జగన్ తన ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. ‘ప్రత్యేక హోదా తెస్తాను అన్నావు.. తెచ్చావా? మద్య నిషేధం చేయనిదే ఓట్లు అడగను అన్నావు.. చేశావా? సీపీఎస్ రద్దు ఏమైంది? ఏటా జాబ్ క్యాలెండర్? మెగా డీఎస్సీ? కరెంట్ ఛార్జీల తగ్గింపు? పోలవరం పూర్తి చేస్తామన్న ప్రగల్భాలు ఏమయ్యాయి’ అని చంద్రబాబు నిలదీశారు.

News March 28, 2024

ఏపీకి ఎన్నికల పరిశీలకుల నియామకం

image

ఏపీ ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురిని నియమించింది. సాధారణ ఎన్నికల అబ్జర్వర్‌గా రామ్‌మోహన్ మిశ్రా, పోలీసు వ్యవహారాల పరిశీలకుడిగా దీపక్ మిశ్రా, ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నీనా నిగమ్‌ నియమితులయ్యారు. వచ్చే వారంలో రాష్ట్రానికి రానున్న వీరు.. జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు.

News March 28, 2024

SRH ప్లేయర్ సరికొత్త రికార్డు

image

IPLలో అత్యధిక జట్లకు ఆడిన భారత ఆటగాడిగా SRH బౌలర్ జయదేవ్ ఉనద్కత్ సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో మనీశ్ పాండే 7 జట్లకు ప్రాతినిధ్యం వహించగా, జయదేవ్ 8 టీమ్స్(KKR, DC, RCB, పుణె, RR, MI, LSG, SRH) తరఫున ఆడారు. అలాగే IPLలో రెండు అత్యధిక స్కోర్లు చేసిన జట్లలో భాగస్వామిగా ఉన్న ఏకైక ఆటగాడిగా నిలిచారు. ఆరోన్ ఫించ్ అత్యధికంగా 9 జట్ల(RR, DC, పుణె, SRH, MI, గుజరాత్ లయన్స్, పంజాబ్, RCB, KKR)కు ఆడారు.

News March 28, 2024

స్వయంగా వాదనలు వినిపిస్తున్న కేజ్రీవాల్

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో స్వయంగా వాదనలు వినిపిస్తున్నారు. ‘రెండేళ్ల క్రితం నుంచి ఈ కేసు నడుస్తోంది. 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదైంది. నాపై ఆరోపణలు లేకున్నా అరెస్టు చేశారు’ అని చెబుతుండగా జడ్జి కావేరీ బవేజా ‘మీ వాదనలను రాతపూర్వకంగా ఇవ్వండి’ అని అడిగారు. దీనికి స్పందించిన కేజ్రీవాల్ ‘కాసేపు మాట్లాడనివ్వండి మేడమ్’ అని వాదనలు కొనసాగిస్తున్నారు.

News March 28, 2024

బీజేపీ తరఫున పోటీ చేసేది టీడీపీ నేతలే: సజ్జల

image

AP: చంద్రబాబు ఇచ్చే హామీలకు విలువ లేదని, ఆయన ఏది చెప్పినా అమలు చేయరని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆయన అధికారంలోకి వస్తే పెన్షన్లు ఆగిపోతాయన్నారు. బీజేపీ తరఫున కూడా టీడీపీ నేతలే పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ బస్సు యాత్రలో ఉపయోగించే ప్యాంట్రీ వెహికల్‌కు ఈసీ అనుమతి తీసుకున్నామని చెప్పారు. దీనిపై తప్పుడు ప్రచారం చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.

News March 28, 2024

ఫారిన్ కరెన్సీ బాండ్లపై అదానీ గ్రూప్ ఫోకస్

image

ఫారిన్ కరెన్సీ బాండ్ల ద్వారా నిధుల సమీకరణ చేపట్టాలని అదానీ గ్రూప్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ కోసం $1 బిలియన్‌ను సమీకరించేందుకు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోందట. జూన్ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తికానుంది. మరోవైపు గుజరాత్‌లోని ముంద్రాలో తొలి కాపర్ రిఫైనరీ ప్లాంట్‌ను నేడు ప్రారంభించడం ద్వారా మెటల్ ఇండస్ట్రీలోకి అదానీ గ్రూప్ అడుగుపెట్టింది.

News March 28, 2024

బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై కేసు నమోదు

image

TG: బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ సహా తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బోడుప్పల్ సమీపంలోని చెంగిచర్లలో పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకుగాను ఈ కేసు నమోదైంది. కాగా హోలీ పండగ నాడు హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పర్యటించేందుకు బండి సంజయ్ నిన్న అక్కడకి చేరుకున్నారు. బండి సంజయ్‌ను పోలీసులు అనుమతించకపోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

News March 28, 2024

కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించలేం: హైకోర్టు

image

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఆయన జైలులో ఉన్నందున సీఎంగా తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కాగా ఇవాళ్టితో ఈడీ కస్టడీ ముగియడంతో ఆయనను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.