Kurnool

News July 20, 2024

శ్రీశైలం డ్యాం తాజా సమాచారం

image

జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో డ్యాం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం రాత్రి 9 గంటల సమయానికి జూరాల ప్రాజెక్టు గేట్లతో పాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 99,894 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 814.5 అడుగులుగా నీటి నిలువ సామర్థ్యం 37.0334 టీఎంసీలుగా నమోదైంది.

News July 20, 2024

BREAKING: కర్నూలు JC, మున్సిపల్ కమిషనర్ బదిలీ

image

కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ.భార్గవ్ తేజను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 62 మంది IAS అధికారుల బదిలీల్లో భాగంగా మౌర్యను తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా, భార్గవ్ తేజను గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

News July 20, 2024

ముచ్చుమర్రి ఘటనలో మృతి.. అంబటి ట్వీట్

image

ముచ్చుమర్రి బాలిక హత్యాచార ఘటనలో అనుమానితుడు హుస్సేన్ మృతి చెందడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘ముచుమర్రి బాలిక ఉదంతంలో హుస్సేన్ అనే అనుమానితుడు లాకప్ డెత్ కావడంపై తక్షణమే విచారణ జరపాలి’ అని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు హుస్సేన్ లాకప్ డెత్ అయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.

News July 20, 2024

జిల్లాస్థాయి యోగా పోటీలు ప్రారంభం

image

కర్నూలులోని అవుట్ డోర్ స్టేడియంలో జిల్లాస్థాయి యోగా ఎంపిక పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ శ్వేతారెడ్డి, న్యాయవాది శ్రీధర్ రెడ్డి, డీఎస్డీఓ భూపతి రావు, యోగా సంఘం సభ్యులు బ్రహ్మానందరెడ్డి, సాయికృష్ణ, అవినాశ్ హాజరై ప్రారంభించారు. దైనందిక జీవితంలో యోగా అంతర్భాగమైనప్పుడే ఆరోగ్యంగా జీవించవచ్చని వారన్నారు. 450 క్రీడాకారులు పాల్గొన్నారు.

News July 20, 2024

తుపాకీ పేలి నంద్యాల జిల్లాకు చెందిన జవాన్ మృతి

image

BDL భానూరులో CISF జవాను శనివారం మృతిచెందారు. విధుల్లో ఉండగా తుపాకీ పేలి తూటా తలలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో జవాను వెంకటేశ్‌(34) అక్కడికక్కడే మృతిచెందారు. బస్సులో నుంచి కిందకు దిగుతున్న క్రమంలో ఆయన వద్ద ఉన్న గన్‌ మిస్‌ ఫైర్‌ అయి ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. నంద్యాల జిల్లా అవుకు మండలం జూనూతల గ్రామానికి చెందిన వెంకటేశ్‌ హైదరాబాద్‌లోని సీఐఎస్‌ఎఫ్‌ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

News July 20, 2024

కర్నూలులో సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు

image

సినీ నటి శ్రీరెడ్డిపై కర్నూలులో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, హోం మంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ బీసీ సెల్ నాయకుడు రాజుయాదవ్ ఫిర్యాదు మేరకు కర్నూలు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికగా తమ నేతలను అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని రాజుయాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

News July 20, 2024

నేను ఇంటర్ ఈ కాలేజ్‌లోనే చదివా: కర్నూల్ ఎంపీ

image

టౌన్ మోడల్ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. శుక్రవారం నగరంలోని ఆ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. ఇదే కళాశాలలో తాను ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశానని గుర్తుచేశారు. కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అవసరమైతే ఎంపీ నిధులను కళాశాల అభివృద్ధికి ఖర్చు చేస్తానని ప్రకటించారు.

News July 20, 2024

కర్నూలు జిల్లాలో 21 మండలాల్లో వర్షం

image

అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 21 మండలాల్లో వర్షం కురిసింది. దేవనకొండలో అత్యధికంగా 22.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదోని 16.2, పత్తికొండ 8.0, క్రిష్ణగిరి 6.6, అస్పరి 6.2, మద్దికెర 5.6, కౌతలం 4.2, గోనెగండ్ల 3.8, తుగ్గలి 3.4, కర్నూలు అర్బన్ 0.8, సి.బెళగల్‌లో 0.2 మి మీ వర్షం కురిసింది. జిల్లాలో సగటున 3.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News July 20, 2024

భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు

image

అగ్నివీర్ పథకంలో భాగంగా భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని నంద్యాల జిల్లా ఉపాధి కల్పనాధికారిణి పి.దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. 21ఏళ్లలోపు వయసు, కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్హతలు ఉండాలన్నారు. ఆన్లైన్‌లో జులై 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.

News July 20, 2024

ఉర్దూ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా బాధ్యతల స్వీకరణ

image

డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ పీఎస్ షావలి ఖాన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈయన ప్రస్తుతం కడపలోని యోగి వేమన యూనివర్సిటీలో బోటనీ విభాగం అధిపతిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బాయినేని శ్రీనివాసులు పాల్గొన్నారు.