Visakhapatnam

News August 26, 2024

అనకాపల్లి జిల్లాలో 912 కిలోల గంజాయి స్వాధీనం

image

లారీలో అక్రమంగా తరలిస్తున్న 912 కిలోల గంజాయిని సబ్బవరం మండలం గుల్లేపల్లి జంక్షన్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా వస్తున్న లారీపై ఆదివారం పోలీసులు దాడి చేసినట్లు తెలిపారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టుపడగా, మరో ఐదుగురు పరారైనట్లు తెలిపారు.

News August 26, 2024

వర్షం కారణంగా ఆర్కేబీచ్ రోడ్డులో ర్యాలీ

image

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని ఆర్.కె.బీచ్ వద్ద నిర్వహించారు. ర్యాలీ నిర్వహణకు పోర్టు స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ వర్షం కారణంగా ట్రాక్ అంతా తడిసిపోయింది. దీంతో బురద కారణంగా అభ్యర్థులు ఇబ్బంది పడతారని భావించిన కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ సూచనతో అధికారులు ర్యాలీని బీచ్ రోడ్‌లో నిర్వహించారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా అభ్యర్థులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

News August 26, 2024

విశాఖలో ప్రారంభమైన ఆర్మీ ర్యాలీ 

image

అగ్నివీర్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం పోర్టు స్టేడియంలో సోమవారం నుంచి ఆర్మీ ర్యాలీ ప్రారంభమైంది. సెప్టెంబర్ 5 వరకూ 11 రోజులు పాటు జరిగే ఈ నియామక ప్రక్రియలో వివిధ రకాల పరీక్షలు పెట్టనున్నారు.
పదో తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులకు పరుగు, శారీరక పరీక్షలు నిర్వహించనున్నారు.

News August 26, 2024

ఉక్కు యాజమాన్యంతో భేటీ కానున్న చంద్రబాబు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకటి రెండు రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో భేటీ కానున్నారు. స్టీల్ ప్లాంట్‌కు వర్కింగ్ క్యాపిటల్, ముడిసరుకు కొరత వంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చంద్రబాబు సోమవారం లేదా మంగళవారం భేటీ కానుండడంతో కార్మికుల్లో ఆశలు చిగురించాయి. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతామని ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం చొరవ చూపించడంతో కార్మికుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.

News August 26, 2024

పరవాడ: ఫార్మా కంపెనీలో ప్రమాదం.. కెమిస్ట్ మృతి

image

పరవాడ సినర్జిన్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖలో చికిత్స పొందుతున్న కెమిస్ట్ సూర్యనారాయణ మృతి చెందాడు. మృతుడు విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి. ఆరోజు సూర్యనారాయణ కెమికల్ మిక్స్ చేస్తుండగా రియాక్షన్ జరిగి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఝార్ఖండ్‌కు చెందిన కార్మికుడు రెండు రోజుల కిందట చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

News August 26, 2024

పరిశ్రమలలో ప్రమాదాలు జరిగితే కఠిన చర్యలు: హోం మంత్రి

image

ఇకపై పరిశ్రమలలో ప్రమాదాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేశ్, కలెక్టర్ విజయ్ కృష్ణన్‌తో కలిసి పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించారు. పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో పరిశ్రమల భద్రతను గాలికి వదిలి వేసినట్లు పేర్కొన్నారు.

News August 26, 2024

విశాఖ: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

విశాఖ ప్రభుత్వ మహిళ కళాశాలలో 10 పీజీ కోర్సుల్లో ఏపీపీజీ సెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్  మంజుల తెలిపారు. ఎకనామిక్స్, ఎంకామ్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, బాటనీ, మైక్రో బయాలజీ, సైకాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు కాలేజీలో సంప్రదించాలని కోరారు.

News August 26, 2024

పారా ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ కోచ్‌గా విశాఖ వాసి

image

పారా ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్టుకు కోచ్‌గా విశాఖకు చెందిన మురళీకృష్ణ వ్యవహరించనున్నారు. ఈనెల 28 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు పలు అంశాల్లో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే బ్యాడ్మింటన్ జట్టుకు మురళీకృష్ణ కోచ్‌గా సేవలు అందించనున్నారు. కోచ్‌గా నియమితులైన ఆయనను పలువురు అభినందించారు.

News August 26, 2024

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు

image

సోమవారం విశాఖ కలెక్టరేట్‌లో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేశారు. కృష్ణాష్టమి పండగ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. ప్రజలు గమనించాలని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

News August 25, 2024

అనకాపల్లి: 29న జాతీయ క్రీడా దినోత్సవం

image

ఈనెల 29న మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి రమణ తెలిపారు. ఈనెల 26 నుంచి క్రీడలతో పాటు వ్యాసరచన తదితర అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నామన్నారు పోటీలను పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాల స్థాయిలో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. విజేతలకు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు.