Visakhapatnam

News January 28, 2026

విశాఖ: స్టీల్ ప్లాంట్‌లో VRSకి 850 దరఖాస్తులు

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో VRS-3 గడువు నిన్నటితో ముగిసింది. ఏడాది మార్చి, సెప్టెంబర్ నెలల్లో ఇప్పటికే 2 దఫాలు VRS అమలు చేశారు. ఈ క్రమంలో DECలో VRS-3 నోటిఫికేషన్ జారీ చేశారు. మొదట JAN 20 వరకు గడువు విధించి తర్వాత జనవరి 27 వరకు పొడిగించారు. గడువు ముగిసే సరికి సుమారు 850 మంది ఉద్యోగులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇప్పటివరకు 40 మంది ఉపసంహరణకు దరఖాస్తు చేయగా, ఉపసంహరణ గడువు ఈ నెల 30 వరకు ఉంది.

News January 28, 2026

నేడు GVMC స్థాయి సంఘం సమావేశం

image

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) స్థాయి సంఘం సమావేశం నేడు ఉదయం 11 గంటలకు జరగనుంది. 159 అజెండా అంశాలతో నిర్వహించే ఈ సమావేశానికి స్థాయి సంఘం చైర్మన్‌, నగర మేయర్‌ పిలా శ్రీనివాసరావు అధ్యక్షత వహించనున్నారు. ఉద్యోగుల సర్వీసు అంశాలు, గ్రేటర్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఈ సమావేశానికి స్థాయి సంఘం సభ్యులు, సంబంధిత అధికారులు హాజరుకానున్నారు.

News January 27, 2026

క్రికెట్ ఫ్యాన్స్‌ అలర్ట్: వైజాగ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..

image

విశాఖలో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. స్టేడియం చుట్టూ 11 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం వైపు వాహనాలను ఆనందపురం, పెందుర్తి మీదుగా మళ్లిస్తున్నారు. నగరం నుంచి వెళ్లే వాహనాలు హనుమంతవాక, అడవివరం మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. ప్రేక్షకులు నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నిలపాలన్నారు.

News January 27, 2026

మద్దిలపాలెంలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

image

మద్దిలపాలెం ఆటోమోటివ్ జంక్షన్ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఒక వ్యక్తిని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. నగరంలో ఆర్టీసీ బస్సులు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయని, అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 26, 2026

విశాఖ: కలెక్టర్ బంగ్లాలో హై-టీ వేడుకలు

image

గణ‌తంత్ర దినోత్స‌వం సందర్భంగా సోమవారం సాయంత్రం కలెక్టర్ బంగ్లాలో హై-టీ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, స్థానిక ఎమ్మెల్యేలు, ప‌ద్మ శ్రీ అవార్డు గ్రహీత కూటికుప్పల సూర్యారావు, సీపీ శంఖబ్రత బాగ్చి ఉన్నారు. చిన్నారులు నిర్వ‌‌హించిన సాంస్కృతిక నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆహుతులను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

News January 26, 2026

మాధవధార: జలధార వద్ద భక్తులు ఫుల్.. సౌకర్యాలు నిల్!

image

మాధవధారలో జలధార వద్ద సింహాచలం దేవస్థానం ఉప దేవాలయలు, మాధవస్వామి ఆలయం ఉన్నాయి. మాఘ మాసంలో అధిక సంఖ్యలో జలధార స్నానం చేసేందుకు భక్తులు వస్తుంటారు. గతంలో లక్షల రూపాయల ఖర్చుపెట్టి స్నానాలు చేసేందుకు పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ పైప్ లైన్ పనిచేయడం లేదు. మహిళల దుస్తులు మార్చుకోవడానికి గదులు, టాయిలెట్స్ కూడా లేవు. దీనిపై అధికారులు స్పందించాలని భక్తులు కోరుతున్నారు.

News January 26, 2026

సముద్ర గర్భంలో జాతీయ జెండా రెపరెపలు

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఋషికొండ ఐటీ జంక్షన్ సమీప సముద్రంలో ‘డైవ్ అడ్డా’ ఆధ్వర్యంలో వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. సీఈఓ భద్రం రామిశెట్టి పర్యవేక్షణలో డైవ్ మాస్టర్స్ బాబి, విష్ణవ్, అర్జున్, స్కోబా డైవర్ సంతోష్ కనకాల సుమారు 15 అడుగుల లోతుకు వెళ్లి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సముద్ర గర్భంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడటం పట్ల పర్యాటకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

News January 26, 2026

విశాఖ: డిఫెన్స్, పోలీస్ శాఖలకు ఈరోజు ప్రత్యేక రాయితీ

image

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కైలాసగిరిలోని గ్లాస్ బ్రిడ్జి నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. దేశ, ప్రజా రక్షణలో నిరంతరం శ్రమిస్తున్న డిఫెన్స్, పోలీస్ శాఖల సిబ్బందికి గౌరవపూర్వకంగా ఈరోజు ప్రత్యేక రాయితీని ప్రకటించారు. టికెట్ ధరలో 50 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు RJ అడ్వెంచర్స్ నిర్వాహకులు రాజేష్ తెలిపారు. అర్హులైన సిబ్బంది తమ ఐడీ కార్డులను చూపి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News January 26, 2026

పోక్సో కేసు.. ఉత్తర్‌ప్రదేశ్‌లో నిందితుడి అరెస్ట్

image

టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2014 నాటి పోక్సో కేసులో పరారీలో ఉన్న నిందితుడు మహమ్మద్ సల్మాన్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిందితుడు బెయిల్ పై వెళ్లి 12 ఏళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. సీపీ ఆదేశాలతో ప్రత్యేక బృందం యూపీలోని బలరాంపూర్‌లో ఇతడిని పట్టుకుని నగరానికి తరలించింది. నిందితుడిని పట్టుకున్న బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

News January 26, 2026

విశాఖ: అపార్ట్మెంట్లో ఏయూ విద్యార్థి ఆత్మహత్య

image

విశాఖ నగరంలోని రేసవానిపాలెంలో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఏయూ ఎంసీఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థి లీలా సాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇతను కృష్ణాజిల్లా అవనిగడ్డ ప్రాంతానికి చెందిన వాడిగా పోలీసులు తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు ఫిర్యాదు మేరకు సోమవారం ఉదయం పోలీసులు వచ్చి తలుపులు తెరవడంతో విషయం వెలుగు చూసింది. దీనిపై త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.