Vizianagaram

News June 17, 2024

కొండపల్లి.. కొండంత అండ అవుతారా..!

image

పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఎమ్మెల్యే అయ్యి కేబినేట్‌లో చోటు దక్కించుకున్న కొండపల్లి శ్రీనివాస్‌పై జిల్లా ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. MSME మంత్రిగా అవకాశం రావడంతో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెర్ప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం నిర్మూళన దిశగా, NRI సాధికారత& సంబంధాలతో విదేశాల్లో ఉండే జిల్లా ప్రజానీకానికి అండగా నిలవాలని కోరుతున్నారు.

News June 17, 2024

విజయనగరం: పలు రైళ్లు రద్దు

image

వాల్తేరు డివిజన్ పరిధిలో పూండి-పలాస సెక్షన్‌లో భద్రతాపరమైన ఆధునీకరణ పనులు కారణంగా పలు రైళ్ళను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే. సందీప్ తెలిపారు. ఈనెల 17న, పలాస- విశాఖ(07471) విశాఖ పలాస(07470), విశాఖ-గుణుపూర్ (08522), గుణుపూర్-విశాఖ(08521), విశాఖ-బ్రహ్మపుర (18526) రైళ్లను, 18న బ్రహ్మపుర-విశాఖ(18525) రైలును రద్దు చేశారు. ప్రయాణికుల గమనించాలని ఓ ప్రకటనలో తెలిపారు.

News June 16, 2024

పారాది తాత్కాలిక వంతెనపై భారీ వాహనాలకు అనుమతి

image

బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిపై తాత్కాలికంగా నిర్మించిన బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలు సాగించవచ్చని బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై లోవరాజుతో కలిసి బ్రిడ్జిని ఆదివారం పరిశీలించారు. భారీ వరద కారణంగా పాడైన ప్రదేశాన్ని పరిశీలించిన ఆయన.. మరమ్మతుల అనంతరం భారీ వాహనాలకు అనుమతులిచ్చారు. కాగా.. పారాది వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చెయ్యాలని వాహనదారులు కోరుతున్నారు. 

News June 16, 2024

విజయనగరం: ఆశలన్నీ ఆమెపైనే..!

image

ఉమ్మడి జిల్లా నుంచి గతంలో ఇద్దరు గిరిజన శాఖమంత్రులుగా పనిచేసినప్పటకీ పలు గిరిశిఖర గ్రామాల్లో సమస్యలు వెంటాడుతున్నాయి. తాజాగా సాలూరు ఎమ్మెల్యే సంధ్యారాణికి అవకాశం రావడంతో సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరుతున్నారు. కురుపాం నియోజకవర్గంలో పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చెయ్యాలని, ఎస్.కోట, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.

News June 16, 2024

సాలూరు: రోడ్డు ప్రమాదంలో హెల్త్ అసిస్టెంట్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో హెల్త్ అసిస్టెంట్ మృతి చెందాడు. రొంపల్లి ఆదినారాయణ(37) పాచిపెంట మండలం జిఎన్‌ పేట పీహెచ్సీలో హెల్త్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం విధులు ముగించుకొని బైక్‌పై వస్తుండగా ముచ్చర్లవలస సమీపంలో లారీ ఢీకొట్టింది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ శ్రీరాములు తెలిపారు.

News June 16, 2024

VZM: ఈ చలానాల రూపంలో రూ.48,015 జరిమానా

image

విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక ఎం.పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. మోటార్ వెహికల్ నిబంధనలను అతిక్రమించిన వారిపై మొత్తం రూ.48,015 ఈ చలనా రూపంలో విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపినవారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 8 కేసులు నమోదు చేయగా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై 21 కేసులు నమోదు చేశామన్నారు.

News June 16, 2024

కొత్తవలస: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

కొత్తవలస మండలం అడ్డూరివానిపాలెం వద్ద శనివారం రాత్రి రెండు ఆటోలు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఎల్.కోట మండలం మళ్లీవీడు గ్రామానికి చెందిన లంక జయమ్మ (60) తలకి తీవ్ర గాయమై మరణించింది. ప్రమాదం జరిగిన వెంటనే కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందింది. పెద్దిరెడ్డి లక్ష్మి, వీ.నిర్మల, కర్రీ సత్యనారాయణ, కర్రీ మంగమ్మ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 16, 2024

పార్వతీపురం: వాహనాల దారి మళ్లింపు చర్యలు

image

బొబ్బిలి మండలం పారాది కాజ్వే పై వరద నీరు చేరడంతో దెబ్బతిన్నదని రాయగడ, పార్వతీపురం నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాల దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు పట్టణ సీఐ కృష్ణారావు తెలిపారు. రాయగడ నుంచి వచ్చే వాహనాలు పాలకొండ రాజాం మీదుగా విజయనగరం వెళ్తాయని ఆయన తెలిపారు. పార్వతీపురం ఫ్లైఓవర్‌‌‌పైన దారి మళ్లింపునకు సంబంధించి బారికేడ్లు వేశారు.

News June 16, 2024

గిరిజనుల కష్టాలు కలిచివేశాయి: మంత్రి సంధ్యారాణి

image

వైసీపీ పాలనలో శాఖలన్నీ భ్రష్టుపట్టాయని మంత్రి సంధ్యారాణి దుయ్యబట్టారు. సాలూరులోని తన నివాసం వద్ద శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా తన బాధ్యత పెరిగిందన్నారు. గిరిజన గర్భిణులు రోడ్లపై ప్రసవించడం, డోలి మోతలతో తిప్పలు, తాగు నీటికి 5KM నడవడం చూసి కన్నీరు పెట్టుకున్నానన్నారు. ఐటీడీఏ పాలకవర్గంతో సమావేశం నిర్వహించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని తెలిపారు.

News June 16, 2024

VZM: ఈ నెల 19 నుంచి ఐటీఐ కౌన్సెలింగ్

image

విజయనగరం జిల్లాలో ఈనెల 19 నుంచి 26 వరకు ఐటీఐ కౌన్సిలింగ్ ఉంటుందని జిల్లా ఐటీఐ కన్వీనర్ టీ.వీ.గిరి ఆదివారం తెలిపారు. కౌన్సెలింగ్‌కు అప్లై చేసుకొన్న విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను పట్టుకొని విజయనగరం గవర్నమెంట్ ఐటీఐ కలశాలకు హాజరు కావలసిందిగా కోరారు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న అభ్యర్థులకు ర్యాంక్, హాజరుకావాల్సిన తేదీని మెసేజ్ రూపంలో పంపిస్తామన్నారు.