WestGodavari

News August 14, 2024

గవర్నర్ విందుకు నరసాపురం పారిశుద్ధ్య కార్మికుడు

image

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్ విందు ఇవ్వనున్నారు. దీనికి నరసాపురం మున్సిపాల్టీకి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు ఎంపికయ్యారు. వివిధ విభాగాల్లో సేవలు చేస్తున్న పలు వర్గాల వ్యక్తులకు ఎట్ హోమ్ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ విందు ఇవ్వడం ఆనవాయితీ. ఈక్రమంలో కరోనా సమయంలో విస్తృత సేవలు అందించిన గుమ్మడి స్వామినాయుడును విందుకు ఆహ్వానించారు.

News August 14, 2024

ఆవులు, గేదెలను రోడ్లపైకి వదిలితే చర్యలు: కలెక్టర్

image

ప.గో. జిల్లాలో ఎక్కడైనా రోడ్లపైకి ఆవులను, గేదెలను వదిలితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరెట్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పశువుల కారణంగా జాతీయ రహదారులు, పట్టణాల్లో ఎక్కువగా యాక్సిడెంట్లు అవడం, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందన్నారు. వాటి యజమానులకు ముందుగా సమాచారం అందించి హెచ్చరికలు జారీ చేయాలని, మార్పు రాకపోతే ఆవులను గోశాలలకు తరలిస్తామన్నారు.

News August 13, 2024

ఎస్పీ నయీమ్ అస్మితో ఎమ్మెల్యే రాధాకృష్ణ భేటీ

image

పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భీమవరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తణుకు నియోజకవర్గంలోని శాంతిభద్రతలు సమర్థవంతంగా అమలు అయ్యేలా చూడాలని కోరారు.

News August 13, 2024

దెందులూరు: రహదారి ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

image

దెందులూరు మండలం సత్యనారాయణపురం సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన మరొక వ్యక్తిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సీఐ నబీ, ఎస్ఐ స్వామి సంఘటన స్థలానికి చేరుకొని లారీకింద ఇరుక్కుపోయిన కారును బయటకు తీసే చర్యలు చేపట్టారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 13, 2024

ఏలూరు: గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం

image

ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొత్తూరులో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన స్థానికులు ఇంట్లో ఉన్న దిమిటి నాగేశ్వరమ్మను బయటకు తీసుకువచ్చారు. కొద్దిసేపటికే సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేశారు.

News August 13, 2024

ప.గో: రైల్వే ట్రాక్‌పై యువతి మృతదేహం

image

గోదావరి నుంచి రాజమండ్రి రైల్వే స్టేషన్ మధ్య డౌన్ లైన్ ట్రాక్‌పై గుర్తు తెలియని యువతి(20) మృతదేహాన్ని గుర్తించినట్లు తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు మంగళవారం తెలిపారు. మృతురాలు నీలం రంగు టాప్ ధరించి ఉన్నట్లు వివరించారు. మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు రాజమండ్రి రైల్వే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

News August 13, 2024

ఫ్రెండ్‌తో బయటకెళ్లి.. అనుమానాస్పద స్థితిలో మృతి

image

ఉండిలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. భీమవరంలోని కందికట్లవారి వీధి వాసి నిఖిల్(25) ఇటీవల ముంబయి నుంచి వచ్చాడు. ఫ్రెండ్‌ పవన్‌తో ఆదివారం బయటకెళ్లిన నిఖిల్ రైల్వే ట్రాక్ వద్ద పడి ఉన్నట్లు పోలీసులకు ఫోన్ రాగా, వారు వెళ్లి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆర్థిక వివాదాల కారణంగా పవనే హత్య చేశాడని నిఖిల్ తండ్రి ఆరోపిస్తున్నారు.

News August 13, 2024

MLA చింతమనేనికి ఫోన్ కాల్స్.. కేసు నమోదు

image

దెందులూరు MLA చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్స్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు ఏలూరు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. చింతమనేనికి కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ చింతమనేని కాల్ డేటా సమర్పించగా కేసు నమోదు చేశామన్నారు. మాజీ MLA అబ్బయ్య చౌదరి అనుచరుల పనే అని చింతమనేని ఆరోపిస్తున్నారు.

News August 13, 2024

ద్వారకాతిరుమలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు!

image

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. బస్టాండ్ సమీప కుచ్చలమెట్టపై దుండగులు తవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో మెట్టపైకి ఎవరూ వెళ్లడం లేదని, గతంలో కొందరు మండప ప్రదేశంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారని గుర్తుచేశారు. 2, 3 రోజులుగా రాత్రివేళ తవ్వుతున్నారని, అక్కడ పసుపు, కుంకుమ, గొయ్యి తీసిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు.

News August 13, 2024

ఏలూరు: గంజాయి రవాణా.. ఏడుగురు అరెస్ట్

image

ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్‌గేట్ వద్ద ఏలూరు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు సోమవారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో చింతపల్లి నుంచి గంజాయి కొనుగోలు చేసి రవాణాచేస్తున్న ఏడుగురు వ్యక్తులను గుర్తించారు. వారి వద్ద 20.30 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఏలూరు ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఎస్పీ సూర్యచంద్రరావు తెలిపారు. వారిని అరెస్ట్ చేశామన్నారు.