news

News May 11, 2024

రూ.10కి మద్యం.. రూ.50కి బియ్యం బస్తా!

image

AP: ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది. కేవలం నగదు పంపిణీనే కాకుండా ఇతర మార్గాల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఒంగోలు నియోజకవర్గంలో మందుబాబులకు రూ.10 నోటు, మహిళలకు రూ.50 నోటును టోకెన్లుగా ఇచ్చారట. ఇవి చూపిస్తే క్వార్టర్ బాటిల్, బియ్యం బస్తాలు అందిస్తున్నారనే సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఓ గోదాములో 3లారీల బియ్యం బస్తాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

News May 11, 2024

సముద్ర ఉష్ణోగ్రతలతో డెంగీ వ్యాప్తిని అంచనా వేయవచ్చు: శాస్త్రవేత్తలు

image

హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను బట్టి డెంగీ విజృంభణను ముందే అంచనా వేయవచ్చని ఓ పరిశోధనలో తేలింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగితే దోమల సంఖ్య పెరిగి, డెంగీ వ్యాప్తిపై ప్రభావం పడుతుందని చైనాలోని నార్మల్ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. 1990 నుంచి పలు దేశాల్లో నమోదైన కేసులను వారు పరిశీలించారు. సముద్ర ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాలకు, డెంగీ విజృంభణకు మధ్య చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు గుర్తించారు.

News May 11, 2024

వచ్చే పంట నుంచి వరికి రూ.500 బోనస్: ఉత్తమ్

image

TG: ఆగస్టు 15లోపు రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. వానాకాలం నుంచి పండిన వరికి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించారు. గత అక్టోబర్‌లోనే మేడిగడ్డ కుంగిందని, అప్పటి BRS ప్రభుత్వం అందులోని నీళ్లు వదిలిపెట్టిందన్నారు. వర్షాకాలంలోనూ బ్యారేజీల్లోని నీటిని దిగువకు వదలాలన్న డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాలతో ముందుకెళ్తున్నట్లు ఉత్తమ్ చెప్పారు.

News May 11, 2024

వారం రోజులు వర్షాలు

image

తెలంగాణలో మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ నెల 15 వరకు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. నేడు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉందని తెలిపారు.

News May 11, 2024

సెప్టెంబర్ 15లోపు ఇంజినీరింగ్ ఫస్టియర్ క్లాసులు: AICTE

image

ఇంజినీరింగ్ ఫస్టియర్ తరగతులను సెప్టెంబర్ 15లోపు ప్రారంభించాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) నిర్దేశించింది. వచ్చే విద్యాసంవత్సరానికి (2024-25) సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను తాజాగా రిలీజ్ చేసింది. జూన్ 30వ తేదీ నాటికి కాలేజీలకు తుది అనుమతులు జారీ చేస్తామని తెలిపింది. జులై 31లోపు ఆయా వర్సిటీలు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని ఆదేశించింది.

News May 11, 2024

మంగళగిరిలో ఐటీ సోదాలు.. రూ.8కోట్ల పట్టివేత

image

AP: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఓ వస్త్ర, వడ్డీ వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారులు రూ.8 కోట్ల వరకు నగదు, రూ.25 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ ఇంత మొత్తం నగదు లభించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

News May 11, 2024

నేటితో ముగియనున్న TS EAPCET పరీక్షలు

image

TG: EAPCET ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ప్రైమరీ ‘కీ’ని ఈనెల 12న ఉదయం విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ‘కీ’తో పాటు రెస్పాన్స్ షీట్లు, ప్రశ్నపత్రాన్ని ఎప్‌సెట్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ప్రైమరీ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు ఈనెల 14న ఉదయం 10 గంటల వరకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

News May 11, 2024

ఇవాళ తెలంగాణలో ప్రియాంకా గాంధీ షెడ్యూల్ ఇదే..

image

కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఇవాళ తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్న ఆమె.. ఒంటిగంటకు తాండూరులో నిర్వహించే జనజాతర సభకు హాజరవుతారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు కామారెడ్డికి వెళ్లి రోడ్ షోలో పాల్గొంటారు. ప్రియాంకతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఆయా ప్రచార సభల్లో పాల్గొననున్నారు.

News May 11, 2024

మే 14న వారికి సెలవు

image

TG: మే 13న ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి మరుసటి రోజు సెలవు ప్రకటిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. సిబ్బందికి మే 14న స్పెషల్ క్యాజువల్ లీవ్ లేదా పెయిడ్ హాలిడేగా గుర్తించాలని సీఈసీ వికాస్ రాజ్ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు.

News May 11, 2024

నువ్వే కారణం.. నీకు తెలుసా..?

image

‘నా ఒక్కడితో ఏమవుతుంది? ఓటు వేసినా వేయకపోయినా పరిస్థితులు ఏం మారడం లేదు’ అనుకుని నువ్వు చేస్తున్న తప్పు నీకు తెలుసా..? నీలాంటి వారు ఓటేయనందుకే అసమర్థులు గెలిచి ఆశించిన పనులు జరగడం లేదు. ఇలా జరిగిన, జరుగుతున్న దానితో పాటు రేపు జరగబోయే దానికి కూడా నువ్వే కారణం. నువ్వు ఓటేస్తే అసలైన నాయకులు గెలిచే అవకాశముంది. అయిదేళ్ల భవిష్యత్తు కోసం అరగంట కేటాయించు. ఓటెయ్.
<<-se>>#VoteEyyaraBabu<<>>