Khammam

News September 3, 2025

కూసుమంచి : జ్వరంతో ఆరేళ్ల బాలుడు మృతి

image

కూసుమంచి మండలం కేశవాపురం గ్రామపంచాయతీ పరిధి చింతలతండా గ్రామానికి చెందిన దారావత్ నాగేశ్వరావు కుమారుడు వార్షిక్ తేజ (6) జ్వరంతో మృతి చెందాడు. గత వారం రోజుల నుంచి జ్వరం రావడంతో ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తేజ కూసుమంచిలో యూకేజీ చదువుతున్నాడు. తేజ మృతితో తండాలో విషాదం అలుముకుంది

News September 2, 2025

గణేష్ నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా అధికారులు

image

ఖమ్మం కాల్వొడ్డు, మున్నేరు వద్ద గణేష్ నిమజ్జన ఘాట్‌లను మంగళవారం అదనపు కలెక్టర్ శ్రీజ, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పరిశీలించారు. శోభాయాత్ర, నిమజ్జన సమయాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రహదారిపై అడ్డుగా వైర్లు, చెట్టు కొమ్మలు లేకుండా చొరవ తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా క్రేన్లు, ఫ్లడ్ లైట్లు, మార్గాలు, బారికేడింగ్ తదితర అంశాలపై చర్చించారు.

News September 2, 2025

ఇందిరమ్మ ఇల్లు కట్టకుండానే రూ. లక్ష జమ..!

image

ఇందిరమ్మ ఇల్లు కట్టకుండానే ఖాతాలో రూ. లక్ష జమయిన ఘటన కామేపల్లి మండలం రేపల్లెవారి గ్రామం జాగన్నతండాలో జరిగింది. బాధితుడు తేజావత్ రవి వివరాలిలా.. ‘నాకు ఇల్లు మంజూరయిన విషయం అధికారులు చెప్పలేదు. కానీ నా ఖాతాలో రూ. లక్ష జమకాగా ఆరా తీయగా ఇల్లు మంజూరయిందని తెలిసింది. ఈ ఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాను. ఇల్లు కట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలి’ అని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.

News September 2, 2025

సూర్యఘర్‌పై అవగాహన.. షెడ్యూల్ ఇలా!

image

సౌర విద్యుత్ ఉత్పత్తి, వాడకాన్ని ప్రోత్సహించేలా రూపొందించిన ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంపై మంగళవారం నుంచి నిర్వహించే అవగాహన సదస్సులకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు విద్యుత్ శాఖ ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. మంగళవారం అన్నారుగూడెం, తల్లాడలో, బుధవారం తనికెళ్ల, కొణిజర్ల, గురువారం నేలకొండపల్లిలో, శుక్రవారం ముదిగొండ, వల్లభితో పాటు శనివారం కందుకూరులో సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు.

News September 2, 2025

వరదల నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి

image

భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం, పునరావాస చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విపత్తు నిర్వహణ నిధుల వినియోగంపై పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను సిద్ధం చేసి, వెంటనే యూసీలను సమర్పించాలని ఆదేశించారు. వరదల కారణంగా దెబ్బతిన్న కాల్వలు, చెరువులు, రోడ్ల మరమ్మతులకు సంబంధించి యుద్ధప్రాతిపదికన యాక్షన్ ప్లాన్‌ను రూపొందించాలని సీఎం సూచించారు.

News September 2, 2025

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఖమ్మం విద్యార్ధి

image

ప్రతిభకు వయస్సు అడ్డుకాదని ఖమ్మం జిల్లాకు చెందిన బచ్చుపల్లి ఇషాన్ నిరూపించాడు. కళ్లకు గంతలు కట్టుకుని వరుసగా 16 దేశభక్తి గీతాలను పియానోపై వాయించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు. చిన్న వయస్సులోనే సాధనతో ఈ రికార్డును సాధించిన ఇషాన్, తన పాఠశాలకే కాకుండా ఖమ్మం జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు. ఇషాన్ ప్రతిభను చూసి పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు, స్థానికులు అభినందించారు.

News September 2, 2025

స్థానిక ఎన్నికలు.. ‘ఆమె’ కీలకం

image

గతనెల 28న ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల చేయగా 31 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 1042 క్లెయిమ్స్ వచ్చాయి. వీటిని పరిష్కరించి తుది జాబితాను నేడు విడుదల చేయనున్నారు. జిల్లాలో మొత్తం 8,02,690 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళలు 4,14,124, పురుషులు 3,88,224, ఇతరులు 22 మంది ఉన్నారు. పురుషుల కంటే 26,180 మంది మహిళలు అధికంగా ఉన్నారు. అభ్యర్థుల విజయంలో వీరే కీలకం కానున్నారు.

News September 1, 2025

మహిళా అభ్యున్నతికి కృషి చేయండి: అదనపు కలెక్టర్

image

మహిళల అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె ఇందిరా మహిళా శక్తిపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, కొత్త స్వశక్తి సంఘాల ఏర్పాటు, బ్యాంకు లింకేజీ రుణాలు, ఏకరూప దుస్తుల కుట్టు పనులు, ఎర్రుపాలెం, కల్లూరులో సోలార్ ప్యానెల్స్, పెట్రోల్ బంక్ ఏర్పాటు వంటి అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు.

News September 1, 2025

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్లు

image

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. విద్యార్థిని సీటు, రహదారి సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, వెలుగుమట్ల చెరువు ఆక్రమణ వంటి సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News August 31, 2025

ఖమ్మం: స్థానిక పోరుకు సమాయత్తం

image

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలుకానుంది. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 571 పంచాయతీల్లో 5,214 వార్డులు, అదే సంఖ్యలో పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయి. ప్రస్తుతం 3,146 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 1,572 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు 10,330 మంది అవసరమని తేల్చారు.