Medak

News September 21, 2025

మెదక్: ‘జిల్లా వ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలు’

image

జిల్లా వ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, పౌర సరఫరాలు, సహకార, వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.

News September 21, 2025

మెదక్: రక్షణ జాగ్రత్తలు అవసరం: ఎస్పీ

image

దసరా పండగ పురస్కరించుకొని ఊర్లకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ప్రజల భద్రత, ఆస్తి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బంగారు నగలు, నగదు, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లో భద్రపరచడం మంచిదన్నారు. ఊర్లకు బయలుదేరే ముందు పక్కింటి, నమ్మదగిన వ్యక్తులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

News September 20, 2025

మెదక్: మంత్రిని కలిసిన ఆరోగ్యశ్రీ ఆస్పత్రి ప్రతినిధులు

image

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలను యథావిధిగా కొనసాగిస్తామని, ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని హాస్పిటల్స్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. వారు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

News September 20, 2025

ఏడుపాయల ఉత్సవాలకు రావాలని కలెక్టర్‌కు ఆహ్వానం

image

పాపన్నపేట మండలం ఏడుపాయలలో కొలువైన శ్రీ వనదుర్గ భవాని మాత దేవస్థానంలో ఈనెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని కలెక్టర్ రాహుల్ రాజ్‌ను ఏడుపాయల ఆలయ కార్యనిర్వహణధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ సిబ్బంది శ్రీనివాస్, ప్రధాన పూజారి శంకర్ శర్మ ఆహ్వానించారు. వేదపండితులు ఆశీర్వదించారు.

News September 20, 2025

మెదక్ పోలీస్ పరేడ్.. అదనపు ఎస్పీ సమీక్ష

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన పరేడ్‌కు అదనపు ఎస్పీ మహేందర్ హాజరయ్యారు. పోలీసుల క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, డ్రెస్ కోడ్‌ను ఆయన సమీక్షించారు. పరేడ్‌లు సిబ్బందిలో ఫిట్‌నెస్, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్‌ను పెంచుతాయని పేర్కొన్నారు.

News September 20, 2025

వారంలోనే అన్నదమ్ముల మృతి.. నిజాంపేటలో విషాదం

image

తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న గుండెపోటుతో మరణించిన ఘటన నిజాంపేట మండలంలో విషాదం నింపింది. 15 రోజుల క్రితం మహమ్మద్ జాన్ మియా(87) చనిపోగా, ఆ బాధతో ఆయన అన్న మహమ్మద్ షాబుద్దీన్(90) శుక్రవారం మృతి చెందారు. వీరి మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

News September 19, 2025

మెదక్: 22 నుంచి ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు

image

మెదక్ పట్టణంలో ఈనెల 22 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో డా.రాధాకిషన్ తెలిపారు. బాలికల పాఠశాలలో పదో తరగతి, బాలుర పాఠశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. పదో తరగతికి 194 మంది, ఇంటర్‌కు 524 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు వివరించారు.

News September 19, 2025

పాపన్నపేట: ఆరోగ్య శిబిరాలకు విశేష స్పందన: కలెక్టర్

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ ఆరోగ్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పాపన్నపేట పీహెచ్సీలో నిర్వహిస్తున్న స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని పరిశీలించి, వైద్య సౌకర్యాలు గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యవంతమైన కుటుంబమే దేశ సంక్షేమని అన్నారు.

News September 18, 2025

MDK: మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

image

మెదక్‌లోని గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్ల కోసం ఈనెల 18, 19న దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఉమాదేవి తెలిపారు. కళాశాలలో బీఎస్సీ, బీఏ గ్రూప్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఎస్టీ విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు 7901097706ను సంప్రదించాలని సూచించారు.

News September 18, 2025

మెదక్: రాష్ట్రస్థాయి పోటీలకు జేఎంజే విద్యార్థులు

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ జేఎంజే విద్యార్థినీలు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ అనిత తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో తమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని, వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ మహేశ్, కార్యదర్శి రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.