News June 3, 2024

త్వరలోనే భూముల మార్కెట్ విలువ పెంపు?

image

TG: ఆదాయం పెంచుకోవడంలో భాగంగా త్వరలోనే సాగు, సాగేతర భూముల మార్కెట్ విలువ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. వాస్తవ ధరలు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో ఈ దిశగా ఆలోచిస్తోంది. గతంలో ఎంత విలువ పెంచారు? ఎంత ఆదాయం వచ్చింది అనే అంశంపై ప్రభుత్వం ఇటీవల ఆరా తీసింది. ప్రాంతాన్ని బట్టి 22-40% పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. అటు రిజిస్ట్రేషన్ ఫీజునూ పెంచే ఛాన్సుంది.

News June 3, 2024

BREAKING: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు స్టాక్ మార్కెట్‌లో జోష్ నింపాయి. ఉదయం 2500 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్.. ప్రస్తుతం 2053 పాయింట్ల లాభంతో చరిత్రలో తొలిసారిగా 76,000 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 605 పాయింట్ల లాభంతో 23,136 వద్ద కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం వరకు మార్కెట్లలో ఇదే జోష్ ఉంటుందేమో చూడాలి మరి.

News June 3, 2024

T20WC: ఒమన్‌- నమీబియా మ్యాచ్ టై

image

T20WCలో భాగంగా ఇవాళ జరిగిన ఒమన్‌-నమీబియా మ్యాచ్ టై అయ్యింది. తొలుత ఒమన్ 109/10 స్కోర్ చేయగా, నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. కాసేపట్లో సూపర్ ఓవర్ జరగనుంది.

News June 3, 2024

కేరళను వణికిస్తున్న భారీ వర్షాలు

image

రుతుపవనాల ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం జిల్లాలో
582 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. కంజిరపల్లి, వైకోమ్, చంగనస్సెరీ డివిజన్లలో 33 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. కొట్టాయం(D)లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. పథనంతిట్ట, అలప్పుళ, ఇడుక్కి, వయనాడ్ జిల్లాల్లో ఈదురుగాలులతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.

News June 3, 2024

ఇజ్రాయెలీలను నిషేధించనున్న మాల్దీవులు

image

ఇజ్రాయెల్ పాస్‌పోర్టు ఉన్నవారు తమ దేశంలో ప్రవేశించకుండా నిషేధించనున్నట్లు మాల్దీవులు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా చట్టాలను మార్చే ప్రక్రియను పరిశీలించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా మాల్దీవులు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా గత ఏడాది దాదాపు 11,000 మంది ఇజ్రాయెలీలు ఆ దేశంలో పర్యటించారు.

News June 3, 2024

రామ్ చరణ్ కూతురికి ప్రభాస్ ‘కల్కి’ గిఫ్ట్

image

బుజ్జి, భైరవ క్యారెక్టర్స్‌తో మేకర్స్ ‘కల్కి’ మూవీపై పిల్లల్లోనూ ఆసక్తి పెంచుతున్నారు. ఈ క్రమంలో బుజ్జి వాహన బొమ్మలు, భైరవ స్టిక్కర్స్, టీ షర్ట్స్‌ను విక్రయిస్తున్నారు. వాటిని సెలబ్రిటీ పిల్లలకూ గిఫ్టులుగా పంపిస్తున్నారు. రామ్ చరణ్ కూతురు క్లీంకారకు కూడా ఈ బహుమతులు అందాయి. ‘థ్యాంక్స్ కల్కి టీమ్. ఆల్ ది బెస్ట్’ అంటూ క్లీంకార.. బుజ్జి బొమ్మతో ఆడుకుంటున్న ఫొటోను ఉపాసన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు.

News June 3, 2024

ఇబ్బంది కలిగిస్తే బయటకు పంపండి: ముకేశ్ కుమార్ మీనా

image

APలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశించారు. రేపు కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని వెంటనే బయటకు పంపించేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలని వివరించారు.

News June 3, 2024

పుణే కారు ప్రమాదం కేసు.. నిందితుడి పేరెంట్స్‌కి రిమాండ్

image

మహారాష్ట్రలోని పుణేలో ఓ మైనర్(17) నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఇద్దరు IT ఉద్యోగులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడి తల్లిదండ్రులు అగర్వాల్, శివానీలు జైలుపాలయ్యారు. కేసులో కీలకమైన రక్త నమూనాలను వీరు మార్చేందుకు యత్నించారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ నెల 5 వరకు వారికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ వ్యవహారంలో భాగమైన ఇద్దరు వైద్యులు, ఓ ఉద్యోగినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

News June 3, 2024

ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం 10 గంటల వరకు భూపాలపల్లి, గద్వాల్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు 40Kmph వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

News June 3, 2024

గ్రామాల్లోనే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు

image

AP: గ్రామస్థాయిలోనే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ హోమీబాబా క్యాన్సర్ రీసెర్చ్ ఇన్‌‌స్టిట్యూట్‌తో కలిసి WHO భాగస్వామ్యంతో 30 ఏళ్లు పైబడిన వారికి టెస్టులు చేపట్టనుంది. విలేజ్ క్లినిక్ స్థాయిలో CHO, ANMలు పరీక్షలు చేస్తారు. ఎవరికైనా అసాధారణ ఫలితాలు వస్తే జిల్లా మెడికల్ కాలేజీల్లో పరీక్షించి, చికిత్స చేస్తారు. ఇందుకోసం వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇస్తారు.