News December 26, 2024

ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ?

image

AP: జనవరి 1న నూతన సంవత్సరం నేపథ్యంలో ఈ నెల 31వ తేదీనే పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ నేతలు చేసిన వినతికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయనుందని వార్తలు వస్తున్నాయి. కాగా ఒకటో తేదీన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరంలో సీఎం చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేస్తారని తెలుస్తోంది.

News December 26, 2024

నక్కపల్లికి మరో ఫార్మా సెజ్: సీఎం రమేశ్

image

AP: విశాఖ సమీపంలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద కొత్తగా ఫార్మా సెజ్ ఏర్పాటుకానుందని ఎంపీ సీఎం రమేశ్ వెల్లడించారు. జనవరి 9న ప్రధాని మోదీ దీనికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. సుమారు 1800 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనిపై కేంద్రం సుమారు రూ.1500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. అలాగే పూడిమడక వద్ద రూ.75వేల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

News December 26, 2024

‘పుష్ప-2’: ఆ పాట డిలీట్

image

‘పుష్ప-2’లోని ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు. ప్రస్తుతం T SERIES తెలుగు ఛానల్లో ఈ వీడియో కనిపించడం లేదు. కాగా, అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించిన డిసెంబర్ 24న సాయంత్రం ఈ పాటను టీ సిరీస్ విడుదల చేసింది. ఈ సాంగ్ పోలీసులను ఉద్దేశించే అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఆ తర్వాత పరిణామాలతో ఈ పాటను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.

News December 26, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 73,301 మంది భక్తులు దర్శించుకోగా 26,242 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామి వారి హుండీకి రూ.4.14 కోట్ల ఆదాయం సమకూరింది.

News December 26, 2024

ఇవాళ సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసే హీరోలు వీళ్లే?

image

తెలంగాణ CM రేవంత్‌తో సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలోని 36 మంది సభ్యుల బృందం నేడు సమావేశం కానున్న సంగతి తెలిసిందే. హీరోలు వెంకటేశ్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీతో పాటు దర్శకులు త్రివిక్రమ్, హరీశ్ శంకర్, అనిల్, బాబీ, వంశీ తదితరులు కలిసే అవకాశం ఉంది. నిర్మాతల్లో అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్, సునీల్ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలుస్తారని సమాచారం.

News December 26, 2024

రూ.99 మద్యంలో తగ్గిన నాణ్యత?

image

AP: కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రూ.99కే క్వార్టర్ మద్యంలో కాస్త నాణ్యత లోపించిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆల్కహాల్ శాతం అలాగే ఉన్నా రుచిలో కొంత వ్యత్యాసం కనిపిస్తోందని పలువురు వినియోగదారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒకట్రెండు ఫేమస్ బ్రాండ్లు నాణ్యతలో రాజీపడుతున్నట్లు సమాచారం. అయితే ప్రమాణాలకు అనుగుణంగా మద్యం ఉండటంతో ఎక్సైజ్ శాఖ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.

News December 26, 2024

వైకుంఠ ఏకాదశి: ఆ పది రోజులు వారికి నో ఎంట్రీ

image

AP: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి 9న ఉ.5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు ఇస్తామని TTD ఈవో శ్యామలరావు చెప్పారు. సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. మిగతా తేదీలకు ఒక రోజు ముందుగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. టోకెన్లు లేని వారికి ఈ పది రోజుల్లో శ్రీవారి దర్శనానికి అనుమతించబోమని తెలిపారు. జనవరి 10-19 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు.

News December 26, 2024

కొత్త ఇల్లు కట్టుకునే వారికి GOOD NEWS

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 4 విడతల్లో రూ.5 లక్షల ఆర్థికసాయంతో పాటు తక్కువ ధరకే సిమెంట్, ఇసుక, స్టీల్ అందజేయాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బస్తా సిమెంట్ ధర రూ.260, టన్ను స్టీల్ రూ.54 వేల వరకు ఉంది. ధర తగ్గించేందుకు కంపెనీలతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఇసుక ఇప్పటికే ప్రభుత్వ అధీనంలో ఉంది.

News December 26, 2024

నేడు కర్ణాటకకు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి నేడు కర్ణాటకకు వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ ఎన్నికై వంద సంవత్సరాలు గడిచిన సందర్భంగా బెల్గాంలో రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. అందులో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితర నేతలు పాల్గొననున్నారు. ప్రత్యేక విమానంలో వెళ్లి రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.

News December 26, 2024

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

image

AP: క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జరిగింది. అంగలూరికి చెందిన కొమ్మాలపాటి సాయి(26) HYDలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. నిన్న క్రిస్మస్ సెలవు కావడంతో ఇంటికి వచ్చి స్నేహితులతో క్రికెట్ మ్యాచ్‌కు వెళ్లాడు. బౌలింగ్ చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే గుడివాడ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.