News September 14, 2024

ప్రతి పరిశ్రమలోనూ కమిటీ ఉండాలి: అనన్య పాండే

image

హేమ కమిటీ తరహాలో ప్రతి సినీ పరిశ్రమలోనూ ఓ కమిటీ ఉండాలని నటి అనన్య పాండే అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే సదస్సులో ఆమె మాట్లాడారు. ‘మహిళలు ఏకతాటిపైకి వచ్చి హేమ కమిటీ వంటివాటిని ఏర్పాటు చేయడం కీలకం. ఇప్పుడిప్పుడే కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. జనం ఈ సమస్య గురించి ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. కానీ పరిష్కారం ఇంకా చాలా దూరంలో ఉంది. దానికోసం పెద్ద యుద్ధాల్ని చేయాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.

News September 14, 2024

పోర్ట్‌బ్లెయిర్ పేరు మార్పును స్వాగతిస్తున్నా: పవన్

image

AP: PM మోదీ నాయకత్వంలోని కేంద్రం పోర్ట్‌బ్లెయిర్ పేరును ‘శ్రీవిజయపురం’గా మార్చడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని dy.cm పవన్ కళ్యాణ్ అన్నారు. ‘పాశ్చాత్య దేశాల బానిసత్వ మూలాలకు నిదర్శనంగా, వలసవాద పాలనకు గుర్తుగా పెట్టిన పేరును తీసేసి, భారత్ సాధించిన విజయాలకు గుర్తుగా శ్రీవిజయపురం పేరు పెట్టడం ఆహ్వానించదగ్గది. భావితరాలపై వలసవాద విధానాల ప్రభావం పడకుండా ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది’ అని తెలిపారు.

News September 14, 2024

ఇక సెలవు.. కామ్రెడ్ ఏచూరి సీతారాం

image

CPM జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంతిమయాత్ర ముగిసింది. ఢిల్లీలోని CPM కేంద్ర కార్యాలయం ఏకే గోపాలన్ భవన్‌ నుంచి ఎయిమ్స్ ఆసుపత్రి వరకు అంతిమయాత్ర సాగింది. అనంతరం ఆయన పార్థివదేహాన్ని ఆసుపత్రికి రీసెర్చ్ కోసం అప్పగించారు. ఇక సెలవంటూ దివికేగిన ఏచూరికి వివిధ దేశాల ప్రతినిధులు, అభిమానులు తుది వీడ్కోలు పలికారు. కడవరకు ప్రజాగొంతుకగా నిలిచిన కామ్రెడ్‌‌ను తలుచుకొని ‘లాల్ సలాం’ అంటూ నినదించారు.

News September 14, 2024

హైడ్రాకు విశేష అధికారాలు రాబోతున్నాయి: రంగనాథ్

image

TG: హైడ్రా వ్యవస్థ చట్టబద్ధమైనదేనని కమిషనర్ రంగనాథ్ పునరుద్ఘాటించారు. ‘కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే దీనిని ఏర్పాటు చేశారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ OCT నెల లోపు ఆర్డినెన్స్ రానుంది. విశేష అధికారాలు రాబోతున్నాయి. 6 వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుంది. గ్రే హౌండ్స్, టాస్క్‌ఫోర్స్ తరహాలో ఇది పని చేస్తుంది. మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తాం’ అని తెలిపారు.

News September 14, 2024

కోచ్ అవగానే ముందు ఆయనకే ఫోన్ చేశాను: మోర్కెల్

image

భారత బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ మోర్నీ మోర్కెల్ నియమితులైన సంగతి తెలిసిందే. ఆ న్యూస్ మొదటగా తన తండ్రికి కాల్ చేసి చెప్పినట్లు మోర్కెల్ తెలిపారు. ‘విషయం తెలియగానే 5 నిమిషాల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయా. ఆ తర్వాత మా నాన్నకి ఫోన్ చేశాను. ముందుగా ఆయనకే చెప్పాలనిపించింది. భారత ఆటగాళ్లతో చాలాసార్లు పోటీ పడ్డాను. ఇప్పుడు వారితో స్నేహం పెంచుకోవాలి. కోచింగ్‌లో అది చాలా కీలకం’ అని పేర్కొన్నారు.

News September 14, 2024

నిర్మాణాలు పూర్తవకుండా కాలేజీలు ఎలా ప్రారంభిస్తాం: సత్యకుమార్

image

AP: ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ‘మెడికల్ కాలేజీల నిర్మాణం గత ఐదేళ్లలో పూర్తి చేయలేదు. వసతులు లేకుండా తరగతులు ఎలా ప్రారంభిస్తాం? వైద్య విద్య అందించాలంటే NMC ప్రమాణాలు పాటించాలి. నిర్మాణంలో ఉన్న 12 కాలేజీల్లో వచ్చే ఏడాది క్లాసులు ప్రారంభిస్తాం. జగన్ ఆరోగ్యశ్రీకి రూ.2500 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారు. మేం రాగానే రూ.652 కోట్లు చెల్లించాం’ అని వివరించారు.

News September 14, 2024

వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం: మంత్రి నాదెండ్ల

image

AP: వైసీసీ చీఫ్ జగన్ తన పాలనలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార యంత్రాంగాన్ని సమన్వయపరిచినట్లు తెలిపారు. లీడర్ అంటే పవన్‌లా ఉండాలని, మీడియా ముందు కాగితాలు పట్టుకొని ఊగిపోవడం ఏంటన్నారు. నిజాయితీ ఉంటే ఆ పార్టీ యంత్రాంగం ప్రభుత్వ వరద సాయంలో భాగమవ్వాలన్నారు.

News September 14, 2024

ఎల్లుండి ఖైరతాబాద్ గణేశ్ దర్శనం లేదు

image

TG: ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక ప్రకటన చేసింది. సోమవారం మహాగణపతి దర్శనానికి అనుమతి లేదని చెప్పింది. శని, ఆదివారం మాత్రమే అనుమతి ఇస్తామని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. మంగళవారం నిమజ్జనం ఉండటంతో సోమవారం వెల్డింగ్ తదితర పనుల నేపథ్యంలో భక్తులను అనుమతించబోమని పేర్కొంది. కాగా మంగళవారం మధ్యాహ్నానికి లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు.

News September 14, 2024

వైద్యులు వర్షంలో ఉంటే నాకు నిద్ర పట్టలేదు: సీఎం మమత

image

కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనలో న్యాయం కోసం నిరసనలు చేస్తున్న వైద్యుల వద్దకు బెంగాల్ CM మమత ఈరోజు వెళ్లారు. వారు వర్షంలోనే నిరసనలు తెలుపుతుండటంతో తనకు రాత్రంతా నిద్రపట్టలేదని తెలిపారు. ‘నిరసనలు తెలియజేయడం మీ హక్కు. వాటికి సెల్యూట్ చేసేందుకే ఇక్కడికి వచ్చాను. నా పదవి కంటే మీ గొంతుకే ముఖ్యం. మీ డిమాండ్లన్నీ పరిశీలిస్తాను. నిందితుల్ని శిక్షిస్తాను. దయచేసి విధులకు హాజరుకండి’ అని కోరారు.

News September 14, 2024

సురేశ్ ప్రొడక్షన్స్ ట్విటర్ ఖాతా హ్యాక్?

image

నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ ట్విటర్ ఖాతా హ్యాక్ అయిందా? ఆ ఖాతాలో తాజాగా పోస్ట్ అయిన ఓ ట్వీట్‌ను చూస్తే ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘Introducing $BERRY on Solana the next 100x gem! CA: 6V5javYTHoxRKMvugNV1AoSYjUerwM9FqTjqeRmZS9TJ Let’s pump this together!’ అంటూ ట్వీట్ చేశారు. ఇది క్రిప్టోకరెన్సీ గురించిన స్పామ్ మెసేజ్ అని నెటిజన్లు వివరిస్తున్నారు.