News March 31, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సూత్రధారి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది. రేపు ఆయన హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు సమాచారం. ప్రభాకర్ రావును విచారించిన అనంతరం బీఆర్ఎస్ కీలక నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న సస్పెండై పోలీసు కస్టడీలో ఉన్నారు.

News March 31, 2024

కేంద్ర ఆర్థిక మంత్రి ఆస్తి ఎంతంటే..

image

ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద డబ్బు లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 2022లో నిర్మల రాజ్యసభ ఎంపీ నామినేషన్‌ ప్రకారం.. ఆమెకు రూ.1.87 కోట్ల స్థిరాస్తులు, రూ.65.55 లక్షల చరాస్తులు ఉన్నాయి. రూ.26.91 లక్షల అప్పు ఉంది. ఇది రెండేళ్ల క్రితం నాటిది. ప్రస్తుతం ఆస్తి విలువ కొంతమేర పెరిగే అవకాశం ఉంది.

News March 31, 2024

ఏప్రిల్ 6న దీక్షలు: KCR

image

TG: కొత్తగా వచ్చే పంటకు కాంగ్రెస్ వాగ్దానం చేసినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని మాజీ CM KCR డిమాండ్ చేశారు. ‘ఏప్రిల్ 2న దీనిపై BRS నేతలు అధికారులకు మెమోరాండాలు ఇస్తారు. ఏప్రిల్ 6న బోనస్ కోసం దీక్షలు చేస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వంపై యుద్ధం చేద్దాం. పాలన చేతకాకపోతే దిగిపోవాలని చెబుతాం. ఈ అసమర్థ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తాం’ అని స్పష్టం చేశారు.

News March 31, 2024

జస్ట్ 1.8 శాతం ఓట్ల తేడాతో గట్టెక్కారు: కేసీఆర్

image

TG: అధికారంలోకి వచ్చి నాలుగో నెల గడుస్తున్నా రుణ మాఫీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘డిసెంబర్ 9 ఎప్పుడు పోయింది. సీఎం రేవంత్ ఎక్కడ పడుకున్నారు. జనాలకు ఇష్టమొచ్చిన సొల్లు పురాణాలు చెప్పి జస్ట్ 1.8శాతం ఓట్ల తేడాతో గట్టెక్కి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. మిమ్మల్ని నిద్రపోనివ్వం. తరిమి కొడతాం’ అని హెచ్చరించారు.

News March 31, 2024

ఎకరానికి రూ.25వేలు ఇవ్వాల్సిందే: కేసీఆర్

image

ఎండిపోయిన పంటకు ఎకరానికి రూ.25వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. ‘రైతుల తరఫున మాట్లాడేవారు లేరనుకుంటున్నారా? మేమున్నాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. లక్ష ఎకరాల్లో పంట పోయింది. ఈ మంత్రులు, సీఎం ఏం చేస్తున్నారు? ఎండిపోయిన పంటకు ఎకరాకు రూ. 25వేల నష్టపరిహారం ఇవ్వాల్సిందే. అప్పటి వరకు వేటాడుతాం. వెంటాడుతాం. ఎక్కడికక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తాం’ అని తేల్చిచెప్పారు.

News March 31, 2024

పార్టీ మార్పులపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

image

TG: తమ పార్టీ నేతలను కాంగ్రెస్‌, బీజేపీలో చేర్చుకోవడంపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కుక్కల్ని, నక్కల్ని గుంజుకుని మీరు ఆహా, ఓహో అనుకోవచ్చు. మా ఎమ్మెల్యేలను తీసుకోవడం చీప్ పాలిటిక్స్. రాజకీయాలు చేస్తూ పోతే ప్రజలు ఏం కావాలి? రాజకీయాలు చేయడానికి మేము రెడీ. చాలా మందిని పాతరేశాం’ అని అన్నారు.

News March 31, 2024

ధోనీకి రెస్ట్.. తెలుగు క్రికెటర్ అరంగేట్రం?

image

వరుస విజయాలతో దూసుకెళ్తున్న CSK ఇవాళ్టి మ్యాచ్‌లో ధోనీకి విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖలో నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కి కెప్టెన్ కూల్ దూరంగా ఉండగా.. తెలుగు క్రికెటర్ అరవెల్లి అవనీశ్‌రావు కీపింగ్ ప్రాక్టీస్ చేశారు. దీంతో ఇవాళ ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో అవనీశ్ అరంగేట్రం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ యంగ్ క్రికెటర్ U-19 వరల్డ్ కప్‌లో బ్యాటింగ్, కీపింగ్‌లో సత్తా చాటారు.

News March 31, 2024

100 రోజుల్లోనే 200 మంది రైతుల ఆత్మహత్య: కేసీఆర్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 100 రోజుల వ్యవధిలోనే రైతులు ఏడ్చే పరిస్థితికి వెళ్తారని తాను అనుకోలేదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితికి ప్రభుత్వ వైఖరి కారణమని దుయ్యబట్టారు. అనేక జిల్లాల్లో పంటలు ఎండిపోయాయని దుయ్యబట్టారు.

News March 31, 2024

బోరు బండ్ల హోరు వినిపిస్తోంది: కేసీఆర్

image

TG: పల్లెల్లో బోరు బండ్ల హోరు వినిపిస్తోందని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. ‘గత ఎనిమిదేళ్లు బోరు బండ్లు కనపడలేదు. ఇప్పుడు లక్షల ఎకరాల పంటలు ఎండుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టట్లేదు. అసత్య ప్రచారాలు చేయడమే వారికి పనిగా మారింది. రాజకీయాలు చేద్దాం. మేమూ పదేళ్లు అధికారంలో ఉన్నాం. అధికారం వస్తుంది.. పోతుంది. అది గొప్ప విషయం కాదు. రైతులు ముఖ్యం’ అని కేసీఆర్ తెలిపారు.

News March 31, 2024

పవన్ వ్యాఖ్యలు హాస్యాస్పదం: పేర్ని నాని

image

AP: పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ‘వైసీపీపై వ్యతిరేకత ఉంటే పవన్ మళ్లీ భీమవరం, గాజువాకలో ఎందుకు పోటీ చేయడం లేదు? ఇప్పుడు పిఠాపురంలో గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. చంద్రబాబువి నీచ రాజకీయాలు. వాలంటీర్లపై ఆయన కక్ష పెంచుకున్నారు. కక్షతోనే పెన్షన్లు అడ్డుకోవాలని చూశారు.’ అని ఆయన మండిపడ్డారు.