news

News February 20, 2025

1 నుంచి కొత్త రూల్.. పాలసీ జారీ తర్వాతే ప్రీమియం వసూలు

image

కొత్తగా హెల్త్, లైఫ్ బీమా తీసుకునే వారి సౌలభ్యం కోసం IRDAI కీలక నిర్ణయం తీసుకుంది. పాలసీ జారీ చేసిన తర్వాతే వినియోగదారుడి ఖాతా నుంచి ప్రీమియం వసూలు చేయాలని బీమా సంస్థలను ఆదేశించింది. మార్చి 1 నుంచి ఈ నిబంధనను అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. పాలసీదారులు తమ అకౌంట్లలో మొత్తాన్ని నిలిపివేసుకునేందుకు BIMA-ASBA(అప్లికేషన్స్ సపోర్టెడ్ బై బ్లాక్‌డ్ అమౌంట్) సదుపాయాన్ని అందించాలని సూచించింది.

News February 20, 2025

నేడు టీజీ ఎప్‌సెట్-2025 నోటిఫికేషన్

image

TG EAPCET-2025 నోటిఫికేషన్ ఈరోజు విడుదల కానుంది. స్థానికేతర కేటగిరీ ప్రవేశాలపై సర్కారు నుంచి స్పష్టత లేకపోవడంతో కొన్ని షరతులకు లోబడి అధికారులు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక BSC ఫారెస్ట్రీ కోర్సులకు గత ఏడాది వరకూ ఎప్‌సెట్‌నే ఆధారంగా చేసుకోగా అటవీశాఖ ఈ ఏడాది స్వయంగా ప్రవేశ పరీక్ష నిర్వహించాలనుకుంది. కానీ దానిపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆ కోర్సు ఎంచుకున్న వారిలో అయోమయం నెలకొంది.

News February 20, 2025

వచ్చే నెల 3న బడ్జెట్?

image

రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 3న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముందు 28వ తేదీన అనుకున్నప్పటికీ ఆరోజు అమావాస్య కావడంతో 3వ తేదీకి మార్చినట్లు తెలుస్తోంది. అప్పులు రూ.83వేల కోట్లకు చేరాయని, రెవెన్యూ లోటు రెండింతలు కానుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంక్షేమ పథకాలు, హామీల అమలు, ఇటు ఖర్చుల నిర్వహణను బ్యాలెన్స్ చేసేందుకు చెమటోడుస్తున్నట్లు వెల్లడించాయి.

News February 20, 2025

కుంభమేళాలో బీజేపీ అగ్రనేతలు

image

బీజేపీకి చెందిన పలువురు కీలక నేతలు తాజాగా కుంభమేళాలో పవిత్రస్నానమాచరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తదితరులు వీరిలో ఉన్నారు. ఇది సనాతన ధర్మంలో ఓ కీలకమైన సందర్భమని నిర్మల వ్యాఖ్యానించగా ఇలాంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని, దేశంలోని నలుమూలలా ఉన్న ప్రజల్ని కుంభమేళా ఏకం చేసిందని సూర్య అన్నారు.

News February 20, 2025

చైతూ ‘హారర్ థ్రిల్లర్’.. మార్చి నెలాఖరు నుంచి షురూ?

image

‘తండేల్’ సక్సెస్‌తో జోరుమీదున్న నాగ చైతన్య కొత్త సినిమాపై ఫోకస్ పెట్టారు. కార్తీక్ దండు డైరెక్షన్‌లో మార్చి నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు. హారర్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీ స్క్రీన్‌ప్లేపై సుకుమార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రత్యేక సెట్లను నిర్మిస్తున్నట్లు టాక్.

News February 20, 2025

త్వరలోనే ‘భూభారతి’ అమలు: మంత్రి పొంగులేటి

image

TG: రాష్ట్రంలో వీలైనంత త్వరగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చిన్న పొరపాట్లకు కూడా తావు లేకుండా దీనిని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భూమిని నమ్ముకుని బతికే వారిని ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వం భూములకు సంబంధించి సమస్యలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్‌తో సమస్యలు మరింత తీవ్రమయ్యాయని ఆరోపించారు.

News February 20, 2025

నేడు పాలకొండకు వైఎస్ జగన్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.11 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి మ.2 గంటలకు పాలకొండకు చేరుకుంటారు. ఇటీవల మరణించిన వైసీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌కు ధైర్యం చెబుతారు. సాయంత్రానికి తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.

News February 20, 2025

ఖాతాల్లోకి రూ.2,000.. ఎవరికంటే?

image

TG: పీఎం కిసాన్ 19వ విడత కింద ఈనెల 24న రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నగదు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులు రిలీజ్ చేయనున్నారు. E-KYC పూర్తి చేసిన వారికి మాత్రమే డబ్బులు అందుతాయి. ఈ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుందని అధికారులు తెలిపారు. కేంద్రం 2018 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

News February 20, 2025

బాబర్ ఆజమ్ ఆటతీరుపై విమర్శలు

image

ఛాంపియన్స్ ట్రోఫీలో నిన్న జరిగిన PAKvNZ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ఎదుట 321 పరుగుల లక్ష్యం ఉండగా బాబర్ 90 బంతులాడి 64 పరుగులు చేశారు. ఆ ఇన్నింగ్స్ ఇతర ఆటగాళ్లపై ఒత్తిడి పెంచి చివరికి జట్టు ఓటమికి కారణమైందంటూ పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ మండిపడుతున్నారు. ఇటు భారత నెటిజన్లు బాబర్‌పై జోకులు పేలుస్తున్నారు.

News February 20, 2025

ఎన్టీఆర్ ‘వార్’ షూటింగ్ పూర్తి?

image

ఎన్టీఆర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఎన్టీఆర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. హృతిక్‌తో కలిసి తారక్ ఓ పాటకు డాన్స్ వేశారని, సినిమాకు అది హైలైట్‌గా ఉంటుందని బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. నేటి నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూట్‌లోకి తారక్ ఎంటర్ కానున్నారని సమాచారం. ఈ ఏడాది ఆగస్టు 15న ‘వార్ 2’ విడుదలయ్యే అవకాశం ఉంది.