Khammam

News January 5, 2026

రేపు ఖమ్మం కలెక్టరేట్‌లో సర్వపక్ష సమావేశం

image

ఖమ్మం జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యంలో రేపు కలెక్టరేట్ కార్యాలయంలో సర్వపక్ష సమావేశం నిర్వహించనున్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిబంధనలు, ఓటరు జాబితా మరియు ఏర్పాట్లపై కలెక్టర్ చర్చించనున్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఈ సందర్భంగా కోరనున్నారు.

News January 5, 2026

200 ఏళ్లు నిలిచేలా.. రూ.200 కోట్లతో మేడారం ముస్తాబు: మంత్రి పొంగులేటి

image

మేడారం జాతర కోసం రూ. 200 కోట్లతో చేపట్టిన ఆధునీకరణ పనులు 95 శాతం పూర్తయ్యాయని, ఇవి 200 ఏళ్లు నిలిచేలా రాతి కట్టడాలతో నిర్మించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండలిలో వెల్లడించారు. జాతర పరిసరాల్లో 10 కి.మీ. మేర నాలుగు లైన్ల రోడ్లు వేశామని, భక్తుల సౌకర్యార్థం మరో 63 ఎకరాలు సేకరిస్తామని తెలిపారు. కుంభమేళా తరహాలో జాతర ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

News January 5, 2026

పాలేరులో ‘షాడో’ మంత్రి పెత్తనం?

image

పాలేరులో మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ ‘షాడో మంత్రి’లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అధికారిక కార్యక్రమాల్లోనూ సొంత పెత్తనం సాగిస్తున్నారని చర్చ నడుస్తోంది. ఇది మంత్రి ఆదేశాలా లేక వ్యక్తిగత నిర్ణయాలా అని కేడర్ అయోమయంలో ఉంది. ఇన్‌ఛార్జ్ ఏకపక్ష వైఖరిపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలు నియోజకవర్గ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

News January 5, 2026

ఖమ్మంలో తగ్గిన కోడిగుడ్ల ధరలు..!

image

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ రైతు మార్కెట్‌లో సోమవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. KG టమాటా రూ.38, వంకాయ 26, బెండకాయ 40, పచ్చిమిర్చి 38, కాకర 46, కంచకాకర 50, బోడకాకర 140, బీరకాయ 50, సొరకాయ 26, దొండకాయ 46, క్యాబేజీ 24, ఆలుగడ్డ 24, చామగడ్డ 28, క్యారెట్ 40, బీట్ రూట్ 24, కీరదోస 26, బీన్స్ 56, క్యాప్సికం 60, ఉల్లిగడ్డలు 45, కోడిగుడ్లు(12) రూ.80 గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత పేర్కొన్నారు.

News January 5, 2026

ఖమ్మంలో ఈ నెల 10 నుంచి టీసీసీ పరీక్షలు

image

ఖమ్మం జిల్లాలో ఈ నెల 10 నుంచి 13 వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (TCC) పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ చైతన్య జైని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News January 5, 2026

పాక్షికంగా అందుబాటులోకి ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే

image

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు తుది దశకు చేరుకోవడంతో వచ్చే నెలలో వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు రాకపోకలను పాక్షికంగా ప్రారంభించేందుకు NHAI సిద్ధమవుతోంది. హైదరాబాద్‌-వైజాగ్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ రహదారిలో మధ్య సెక్షన్ పూర్తవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త మార్గం వల్ల పాత రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి.

News January 4, 2026

ఖమ్మం: 150 మంది డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు

image

రవాణా మాసోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య, కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 150 మంది డ్రైవర్లు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. ఎంవీఐలు దినేష్, సుమలత, రవిచందర్, వైద్యులు గౌతమ్, నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డ్రైవర్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమని అధికారులు పేర్కొన్నారు.

News January 4, 2026

ఖమ్మం: సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా కళ్యాణం వెంకటేశ్వర్లు

image

సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా ఖమ్మం నగరానికి చెందిన కళ్యాణం వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. డిసెంబర్ 31వ తేదీ నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరిగిన సీఐటీయూ జాతీయ మహాసభల్లో ఎన్నిక నిర్వహించారు. ప్రస్తుతం ఆయన సీఐటీయూ ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.

News January 4, 2026

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులు పడ్డ ఇబ్బందులను తొలగించేందుకు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని ఆయన పేర్కొన్నారు.

News January 4, 2026

ఖమ్మం: దరఖాస్తుల ఆహ్వానం

image

రేవంత్ అన్న కా సహారా, ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహ్మద్ ముజాహిద్ తెలిపారు. గతంలో ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, ఆ పత్రాలను సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాల్లో అందజేయాలని ఆయన సూచించారు.