News July 23, 2024

ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి: APSDMA

image

AP: భద్రాచలం వద్ద ప్రస్తుత నీటిమట్టం 51.5 అడుగులుగా ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్&ఔట్ ఫ్లో 13.09 లక్షల క్యూసెక్కులుగా ఉందని తెలిపింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని, NDRF, SDRF బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని పేర్కొంది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీశైలం జలాశయానికి 1.73లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని తెలిపింది.

News July 23, 2024

అసెంబ్లీకి జగన్ దూరం!

image

AP: అసెంబ్లీ సమావేశాలకు YCP సభ్యులు హాజరయ్యే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు జగన్ తన పార్టీ MLAలతో కలిసి ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు అక్కడ ధర్నా నిర్వహించి, గురువారం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. తర్వాత శుక్రవారం ఒక్కరోజు మాత్రమే సమావేశాలు ఉంటాయి. అందువల్ల వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. నిన్న సభకు వచ్చిన జగన్ కాసేపటికే వాకౌట్ చేసి వెళ్లిపోయారు.

News July 23, 2024

పొలాల్లో నీరు నిల్వ ఉంచవద్దు: వ్యవసాయ వర్సిటీ

image

TG: విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటల ముంపును నివారించేందుకు రైతులు చర్యలు చేపట్టాలని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంచాలకులు రఘురామిరెడ్డి సూచించారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొలాల్లో నిలిచిన మురుగు నీటిని తొలగించాలని, నిల్వ ఉంచవద్దని అన్నారు. పురుగు మందులను పిచికారీ చేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలని చెప్పారు. ఈ నెలాఖరు వరకు నాట్లు వేసుకోవచ్చని అన్నారు.

News July 23, 2024

రెజ్లింగ్‌లో మన పట్టు కొనసాగుతుందా?

image

పారిస్ ఒలింపిక్స్ సమీపిస్తున్న వేళ భారత్ తరఫున ఫేవరెట్లలో ఒకటైన రెజ్లింగ్ జట్టు ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. పురుషుల్లో ఈసారి అమన్ షెరావత్ ఒక్కరే బెర్త్ సాధించారు. మహిళా రెజ్లర్లలో వినేశ్ ఫోగట్, అంతిమ్ పంఘల్, అన్షు మాలిక్, నిషా దహియా, రితికా హుడా పోటీకి దిగనున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ వేధించారని మహిళా రెజ్లర్లు గతంలో నిరసించిన నేపథ్యంలో ఈ టోర్నీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

News July 23, 2024

నేడు ఢిల్లీకి వైఎస్ జగన్

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకుని అక్కడి నుంచి విమానంలో హస్తినకు చేరుకుంటారు. 3 రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. కాగా.. రాష్ట్రంలోని ఎన్డీయే సర్కారు పాలనను నిరసిస్తూ రేపు ఢిల్లీలో ధర్నాకు వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఆయన పాల్గొననున్నారు.

News July 23, 2024

వారికి రూ.1,00,000.. అప్లై చేసుకోండి!

image

TG: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ కింద ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం చేస్తోంది. ఇందుకోసం తాజాగా సైట్ ప్రారంభించింది. ఫొటో, సంతకం, ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు, మెయిన్స్ అప్లికేషన్ ఫామ్, బ్యాంక్ వివరాలు, ఇన్‌కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులు అర్హులు. చివరి తేదీ: ఆగస్టు 6. సైట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News July 23, 2024

కర్ణాటకలో నీట్ రద్దు.. తీర్మానానికి ఆమోదం

image

కర్ణాటకలో నీట్‌ను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది. దాని స్థానంలో వేరే పరీక్షను నిర్వహించడమో లేక కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ పెట్టడమో చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టనుంది. నీట్(UG) పేపర్ లీక్ కావడం ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. గత నెలలో తమిళనాడు ప్రభుత్వం కూడా నీట్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

News July 23, 2024

నిర్మల ఖాతాలో చేరనున్న మరో రికార్డ్

image

వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ నేడు రికార్డ్ నెలకొల్పనున్నారు. దీంతో మొరార్జీ దేశాయ్ (6) రికార్డ్ బ్రేక్ కానుంది. అయితే అత్యధికసార్లు బడ్జెట్ తెచ్చిన ఘనత దేశాయ్ (10) పేరునే ఉంది. నిర్మల ఖాతాలో సుదీర్ఘ ప్రసంగం చేసిన రికార్డ్ కూడా ఉంది. 2020లో రెండు గంటల నలభై నిమిషాలు ఆమె ప్రసంగించారు. 2021లో డిజిటల్ బడ్జెట్ తెచ్చి కొత్త విధానానికి ఆమె నాంది పలికారు.

News July 23, 2024

హమ్మయ్యా.. భారీ వర్షాల్లేవు!

image

తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు బ్రేక్ పడింది. ఏపీ, తెలంగాణలో నేటి నుంచి భారీ వర్షాలు లేవని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. నేడు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, తూ.గో., ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అటు తెలంగాణలోనూ రాబోయే 6 రోజుల పాటు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.

News July 23, 2024

వరుస సినిమాలతో బిజీగా మీనాక్షి

image

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, విశ్వక్‌సేన్‌ ‘మెకానిక్ రాకీ’, వరుణ్ తేజ్ ‘మట్కా’ తదితర చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక తమిళ స్టార్ విజయ్ నటించిన ‘GOAT’లో ఈ ముద్దుగుమ్మే హీరోయిన్. సీనియర్, జూనియర్ హీరోలతో అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారిపోయారు మీనాక్షి.